- పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట ధీమా
- సుల్తానాబాద్ మండల పరిధిలోని గ్రామాల్లో విజయరమణారావు ప్రచారం
- దాసరి మనోహర్ రెడ్డి సహజ సంపదను దోచుకుంటున్నారని విమర్శ
వేద న్యూస్, సుల్తానాబాద్:
ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి, భూపాతిపూర్, బొంతకుంటపల్లి, నర్సయ్యపల్లి గ్రామాలలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణా రావు ఎన్నికల ప్రచారం శనివారం నిర్వహించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజల అభయ హస్తమని చెప్పారు. ఐతరాజుపల్లి, భూపాతిపూర్, బొంతకుంటపల్లి, నర్సయ్యపల్లి గ్రామాల మహిళలు ప్రజలుఅడుగడుగునా డప్పు సప్పుళ్లతోని, కోలాటాలతో విజయ రమణ రావుపై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చింతకుంట మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తుందని పేర్కొన్నారు. యువతుల వివాహానికి తులం బంగారం,లక్ష రూపాయలు, రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ,వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్,ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.
ప్రజల ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా గెలుస్తే రైతులకు వడ్ల కటింగ్ జరగకుండా చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలను స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మోసం చేస్తూ నియోజకవర్గంలోని సహజ సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. రైతులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.