వేద న్యూస్, హైదరాబాద్/చార్మినార్:
హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కళాశాల డిగ్రీ ద్వితీయ సంవత్సర విద్యార్థి చిక్కొండ్ర రవి రెండు జాతీయ కవితా పురస్కారాలు సాధించినట్లు ఆ కాలేజీ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కోయి కోటేశ్వర రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోపూరి వెంకట సుబ్బారావు ధర్మ నిధి సందర్భంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం(తిరుపతి)లో తెలుగు శాఖ నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీలో చిక్కొండ్ర రవి ద్వితీయ బహుమతి సాధించారు.

ఇటీవల జరిగిన ధర్మనిధి సదస్సులో శ్రీ పద్మావతి విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య దేవూరి భారతి, సుప్రసిద్ద రచయిత్రి ఓల్గా చిక్కొండ్ర రవికి రూ.2,500 నగదు, బహుమతి, ప్రశంసా పత్రం ప్రదానం చేశారు. విశ్వ విద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, ప్రముఖ సాహితీ వేత్త డా. దీర్ఘాసి విజయ కుమార్, డా సుభాషిణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గురజాడ సాంసృతిక సమాఖ్య (విజయనగరం)లో గురజాడ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలో విజేతగా నిలిచి చిక్కొండ్ర రవి.. మహా కవి గురజాడ ఉత్తమ కవితా పురస్కారాన్ని సాధించారు. పరీక్షల కారణంగా రవి బహుమతి ప్రదానోత్సవ సభకు హాజరు కాలేదు.

 

సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.బాలభాస్కర్ నిర్వాహకుల పక్షాన చిక్కొండ్ర రవికి జ్ఞాపిక, ప్రశంసా పత్రం, రూ.2,500 నగదు బహుమతిని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిన్న వయస్సులోనే ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు సాధించిన రవిని ప్రిన్సిపాల్ ఆచార్య బాల భాస్కర్, ఐక్యూఏసి కో ఆర్డినేటర్ డా.నీరజ, తెలుగు శాఖ అధ్యాపకులు అభినందించారు.