వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరిపై మరొకరు నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే సంగతి మనకు తెల్సిందే.. ఓటుకు నోటు కేసు దొంగ.. ప్రతి నెల ఢిల్లీకి బ్యాగులు మోసే వాడు అని నిత్యం విమర్శలు చేస్తారు మాజీ మంత్రి కేటీఆర్..గత పదిహేను నెలలుగా ఒకపక్క ప్రభుత్వలోపాలపై గొంతెత్తూనే.. మరోవైపు రేవంత్ రెడ్డిపై ఎప్పటికప్పుడూ లోపాలను బయటపెడుతూ ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తున్నాడు.
“తానేమి తక్కువ తిన్నాన అంటూ కేటీఆర్ లెక్క తండ్రిని అడ్డుపెట్టుకుని సీఎం కాలేదు. పదవుల్లోకి రాలేదు. మిషన్ భగీరథ నుండి ఫార్ములా ఈ కారు రేసు వరకూ అన్ని అవినీతి అక్రమాలే.. ఒక్కొక్కటి బయటకు తీస్తాను. గత ప్రభుత్వ అవినీతిని ప్రజల ముందు నిలబెడతానని” సీఎం రేవంత్ ప్రగల్భాలు పలుకుతారు. ఎదురు ఎదురుపడితే కొట్టుకుంటారా? అనే డౌటానుమానం వచ్చేలా వీరిద్దరి విమర్శలు ఆరోపణ ప్రత్యారోపణలు ఉంటాయి.అలాంటి వీరిద్దరూ ఒకే వేదికపై ఉన్న సందర్భం ఇంతవరకూ తారస పడలేదు. చూడలేదు. అలాంటి సందర్భమే తాజాగా చోటు చేసుకుంది.
తమిళ నాడు ముఖ్యమంత్రి.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో త్వరలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన దేశ వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై దక్షిణాది రాష్ట్రాల సమావేశం శనివారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. ఈ భేటీకి తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. కేరళ నుండి సీఎం పినరయి విజయన్, కర్ణాటక నుండి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. వీరంతా నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి కలిగే నష్టాలపై చర్చలు జరిపారు.. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపైనా పార్టీలన్నీ సమాలోచనలు చేస్తున్నాయి.
ఓ అంశంపై ఇద్దరి ఏకాభిప్రాయం
తాజాగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే అంశంపై ఏకాభిప్రాయానికి రావడం ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. వారిద్దరూ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి హాజరుకావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే అంతా ఒక్కటిగా చేతులు కలుపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు తెలంగాణ ఉద్యమమే ఉదాహరణగా చూపిస్తున్నారు.