•  అన్ని కోణాల్లో హస్తం అధిష్టానం ఆలోచన
  •  ఉద్యోగ సంఘ నాయకుడిని బరిలో నిలిపేందుకు పరిశీలన
  •  హస్తం పార్టీ అధిష్టానం ఆశీస్సులెవరికో..తెరపైకి పరికి సదానందం పేరు

వేద న్యూస్, వరంగల్:

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచి సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిచి చూపించాలనే లక్ష్యంతో అందుకు ప్రణాళికలు రచించుకుంటోంది. ముఖ్యంగా ఇప్పుడు అందరి చూపు వరంగల్ లోక్ సభ సీటుపైన పడిందని చెప్పొచ్చు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. ఈ క్రమంలో వరంగల్ లోక్ సభ స్థానం సైతం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో విజయంగా నమోదవుతుందని హస్తం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్ కాగా, ఈ స్థానం కోసం ఆశావహుల మధ్య తీవ్ర పోటీ ఉందని చెప్పొచ్చు.

తాజాగా సరికొత్త పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరికి సదానందం పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా పైడిపల్లి గ్రామ వాస్తవ్యులు అయిన సదానందం పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

విద్యుత్ ఉద్యోగ కార్మిక సంఘాలు, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాలకు చెందిన ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులతో బలమైన సంబంధాలు కలిగిన పరికి సదానందంకు టికెట్ ఇవ్వడం ద్వారా అన్ని వర్గాలను విశ్వాసంలోకి తీసుకున్నట్లు అవుతుందని భావిస్తున్నట్లు టాక్.

వరంగల్ లోక్ సభ నియోజక వర్గ పరిధిలో విద్యుత్ సంస్థ కు చెందిన సుమారు 6,500 మంది ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులు ఇదే వరంగల్ పార్లమెంట్ పరిధిలో పనిచేస్తున్నారు. వారి మద్దతు అదనపు బలంగా కాంగ్రెస్ పార్టీకి గెలుపునకు అడుగులు పడటంలో ఉంటుందనే అంచనా వేసుకుంటున్నట్లు వినికిడి. తెలంగాణ ఉద్యమంలో సైతం పరికి సదానందం కీలక పాత్ర పోషించారు. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానం వరంగల్ పార్లమెంట్ స్థానం టికెట్ చివరికి ఎవరికి ఇచ్చేనో..