• అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రణయ్ కుమార్ వినతి

వేద న్యూస్, ఆసిఫాబాద్:

సీసీఐ ద్వారా పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని  కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి కి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం వ్యవసాయం పత్తి పంట పై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

ఇప్పటివరకు దాదాపు 70  శాతం మంది రైతులు పత్తి పంటను అమ్మినప్పటికీ మిగతా ఉన్నా రైతులు ఇప్పుడిప్పుడు జిన్నింగ్ మిల్లులకు పంటను తరలిస్తున్నారని  పేర్కొన్నారు. అయితే, జిల్లాలో సిర్పూర్ ,కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్, చింతలమానపెళ్లి, దాహెగాం పరిసర ప్రాంత రైతులు 15 నుండి 20 రోజులు లేటుగా విత్తనాలు విత్తుకోవడంతో దిగుబడి కూడా ఆలస్యం గానే చేతికి వస్తుందని వివరించారు.

ఈ నేపథ్యంలో ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించి సీసీఐ ద్వారా పూర్తిస్థాయిలో పత్తి పంట కొనుగోలు చేసే విధంగా తగు చర్యలు తీసుకొని రైతులకు మేలు  చేయాలని విన్నవించారు. కార్యక్రమం లో బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వైరాగడే మారుతీ పటేల్, బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు బొట్టుపల్లి ప్రశాంత్, మండోరే తుకారాం తదితరులు పాల్గొన్నారు.