- పోరాటాల గడ్డ…హుజురాబాద్ అడ్డా అని వ్యాఖ్య
- తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమని ధీమా
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట:
సీఎం కేసీఆర్ చెల్లని కరెన్సీ నోటు, నకిలీ నోటు అని, ఆ చెల్లని కరెన్సీ నోటును జేబులో పెట్టుకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి విమర్శించారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ ‘ప్రజా విజయభేరి’ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవంత్ రెడ్డి అశేష జన సందోహాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నో బలిదానాలపైన ఏర్పడ్డ తెలంగాణను సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మారుస్తానంటూ ఉత్తర రాకుమార ప్రగల్బాలు పలికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చాడని తీవ్రంగా దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. విద్యార్థుల బలిదానాలను ఆపాలనే సంకల్పంతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు.
రాష్ట్రంలో సమూల మార్పు రావాలి..దొరల పాలన పోవాలి అంటే ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఏడుసార్లు హుజరాబాద్‌లో ఎమ్మెల్యే గెలిచిన ఈటల రాజేందర్ ఆత్మగౌరవం పేరిట గెలిచి ప్రజలను నయవంచన గురి చేశారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుండి నయా పైసా నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకురాలేని అసమర్థ నాయకుడని చురకలంటించారు. హుజురాబాద్ అభివృద్ధిని మరిచి హుజురాబాద్ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, హుజురాబాద్ ప్రజలను విడిచి గజ్వేల్ లో పోటీ చేయడం విడ్డూరంగా ఉందని తీవ్రంగా దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు. మాయమాటలు ప్రజలను నయవంచన గురి చేసేందుకు వస్తున్న బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పోరాటాల గడ్డగా పేరొందిన హుజురాబాద్ నియోజకవర్గం ఎన్నో ఉద్యమాలకు పెట్టింది పేరు అని గుర్తుచేశారు. ఇక్కడి మట్టిలో ఎంతోమంది నాయకులు జాతీయ రాజకీయాలను శాసించిన మహోన్నత వ్యక్తులను కలిగిన గడ్డ హుజరాబాద్ గడ్డ అని కితాబునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పీవీ నరసింహారావు, ఎం.సత్యనారాయణరావు, చొక్కారావు, శ్రీపాదరావు, ముద్దసాని దామోదరరెడ్డి వంటి ప్రముఖ నాయకులు ప్రజల కోసం పని చేశారని తెలిపారు. అలాంటి గడ్డపై కోవర్టులు పోటీ చేయాలని చూస్తున్నారు అలాంటి కోర్టులకు చైతన్యవంతమైన హుజురాబాద్ ప్రజలు తమ ఓటు హక్కుతో గట్టి గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు.
ఉప ఎన్నికల సమయంలో శత్రుపక్షాన వైరి పక్షంలో చేరి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలలో గెలిచిన ఈటల రాజేందర్ మూడేండ్లుగా హుజురాబాద్ అభివృద్ధి కోసం ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే శ్రేణులు డిసెంబర్ 9 వరకు ఇదే ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం ఉప ఎన్నికల్లో పార్టీకి అండగా నిలబడ్డ బల్మూరి వెంకట్..వొడితల ప్రణవ్ కు సంపూర్ణ మద్దతు తెలిపారని చెప్పారు.
నమ్మి నాన పోస్తే పుచ్చు బుర్రలు అయినట్లు ఎమ్మెల్సీ పదవి కోసం, కమీషన్ల కోసం పార్టీ కి ద్రోహం చేశారని, ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ పదవి పెద్దదని, దొర గారి గడిలో గ్లాస్‌లో మందు పోయవచ్చు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా చురకలాంటించారు. బీజేపీ అభ్యర్థి ఈటల, ఎమ్మెల్సీ..ఇద్దర్నీ చూసిన ప్రజలు..ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు. పార్టీ గెలిచిన తర్వాత పీవీ నరసింహారావు పేరిట జిల్లాను ప్రకటించే బాధ్యత ప్రణవ్ తీసుకుంటారని హామీనిచ్చారు.మచ్చ లేని కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ప్రణవ్ అని తెలిపారు.
ప్రణవ్ గెలిచిన తర్వాత ఏ కాగితం తెచ్చినా దానిని ఆమోదిస్తానని రేవంత్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసగించిందని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత మనోధైర్యం కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతీ యువకులు కూలీ పనులకు వెళ్తున్నారని చెప్పారు. హుజురాబాద్ ప్రజలు ఏడు సార్లు గెలిపిస్తే వారిని కాదని ఈటల రాజేందర్ గజ్వేల్ కు వెళ్తున్నారని దుయ్యబట్టారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందే అని ఆరోపించారు. వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తానని అంటున్న ఎమ్మెల్సీని అభివృద్ధి చేయడంలో ఎవరు ఆపారని ప్రశ్నించారు. హుజురాబాద్ లో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి అండగా ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ కల్పనతో పాటు మహిళలకు రక్షణ కల్పించడంలో ముందుంటుందని తెలిపారు. ఈవీఎం బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ 4లో ఉన్న చేతి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ప్రజలను వొడితల ప్రణవ్ అభ్యర్థించారు.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. తాను ప్రణవ్ తో పాటు హుజురాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పార. కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, ఎన్ఎస్‌మయూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ నాగ మధు యాదవ్, పీసీసీ కమిటీ మెంబర్ దాసరి భూమయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, మాజీ జెడ్పిటిసి అరుకాల వీరేశలింగం, కిసాన్ సెల్ మాజి అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.