– మనీ ఆశ చూపి సోషల్ మీడియాలో మోసాలు
– లింకులు ఓపెన్ చేస్తే .. క్యాష్ ఖల్లాస్
– జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతులు
వేద న్యూస్, ఫోకస్ టీమ్ :
ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ మామూలు విషయమైన ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మొబైల్ ఫోనుకు లింకులు పంపుతూ.. బ్యాంకు అకౌంట్లను కొల్లగొడుతున్నారు. లోన్లు ఆఫర్లు, ఉద్యోగ అవకాశాలు లక్కీ డ్రా బ్యాంక్ కేవైసీ.. ఇలా ఏదో ఒకటి చెబుతూ అమాయకులను దోచేస్తున్నారు. వాట్సప్ ఫేస్బుక్ మధ్యమాలను వేదికగా చేసుకొని ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. బ్యాంకులో కార్పొరేట్ సంస్థల లోగోలతో మొబైల్ ఫోన్లో కు ఏపీకే ఫైళ్లు, లింకులు పంపుతా అందినకాడికి దోచుకుంటున్నారు. రైతులను పీఎం కిసాన్ సమ్మాన్, రైతు భరోసా పేరుతో మోసం చేస్తున్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా మోసపోతున్నారు. డిజిటల్ లావాదేవీలు గేమింగ్ యాప్ లో సైబర్ నేరగాళ్లకు వరంలా మారాయి. వరంగల్ జిల్లాలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరుగుతున్నది.
*సైబర్ నేరాలపై పోలీసుల సూచన..*
సైబర్ నేరాలపై తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు ప్రజలకు నిత్యం ఏదో ఒక రకంగా అవగాహన కల్పిస్తున్నారు. గుర్తు తెలియని లింకులు క్లిక్ చేయద్దు. వచ్చే లింకులు పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఓపెన్ చేయాలి. డిజిటల్ చెల్లింపులు, బ్యాంక్ ఖాతాలలో నగదు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి గాని లేదా వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, ఫోన్లు లిఫ్ట్ చేసి బ్యాంకు వివరాలు ఓటీపీ ఆధార్ పాన్ కార్డు వివరాలను చెప్పొద్దు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 లేదా cybercrime.gov. in కు ఫిర్యాదు చేయాలి. సైబర్ మోసానికి గురైన గంటలోపు ఫిర్యాదు చేస్తే న్యాయం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే రూ.7 లక్షల వరకు సైబర్ వలలో చిక్కుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. రూ.7 లక్షలకు పైగా మోసపోయి ఉంటే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
*ఏపీకే లింక్ ఓపెన్ చేయగానే రూ.46 వేలు మాయం*
పెరుమాండ్ల అంజయ్య అనే వ్యక్తి ఈ నెల 13న సాయంత్రం తనకు పరిచయం ఉన్న వ్యక్తి నుంచి తమ సంఘం గ్రూపులో పీఎం కిసాన్ ఏపీకే లింక్ వచ్చింది.తమ సహచరులే పంపారనుకుని.. సదరు లింక్‌ను ఓపెన్ చేసి లింక్ అర్ధం కాకపోవడంతో బ్యాక్ వచ్చి అలాగే ఉంచాడు. లింక్ ఓపెన్ కాగానే సైబర్ నేరగాళ్లు 14వ తేదీ రాత్రి 2 గంటల నుంచి 3.30 వరకు ఖాతాలో ఉన్న సొమ్ములోంచి రూ.46 వేలు దఫదఫాలుగా విత్‌డ్రా చేశారు. అంజయ్య ఉదయం లేచి తన వాట్సాప్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా పోన్ పనిచేయడం నిలిచిపోయి ఫోన్ వేడెక్కిపోయింది.వెంటనే అర్థం కాక తన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతా చెక్ చేసుకునే సరికి రూ.46 వేలు ఖాళీ కాగా సదరు బ్యాంకు స్టేట్మెంట్ ద్వారా 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు.
*లింక్ క్లిక్ చేశాడు..రూ.42,600 మాయం*
వరంగల్ రామన్నపేటకు చెందిన వ్యాపారికి బ్యాంక్ ఏవైసీ అప్డేట్ చేయాలంటూ వచ్చిన మెసేజ్ క్లిక్ చేస్తే తన ఖాతా నుండి రూ.42,600 మాయమయ్యాయి. కిరాణా షాప్ లో ఖాతా డబ్బులు కట్టాలని బ్యాంకు అకౌంట్ లో ఉంచుకున్న డబ్బులు మాయమయ్యేసరికి ఫిర్యాదు చేశాడు.