• టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ 

వేద న్యూస్, వరంగల్:

తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకు ఖరీఫ్ “రైతు భరోసా ” ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి (టి ఆర్ ఆర్ ఎస్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.

గత సర్కారు కొవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ రైతుబంధును క్రమం తప్పకుండా అందించిందని గుర్తు చేశారు. రైతుకు పెట్టుబడి అందించి వారిని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీటిని తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను అందజేయాలన్నారు. రుణమాఫీని సంపూర్ణంగా చేయాలని కోరారు.

వానాకాలం పంట పూర్తయి.. యాసంగి పంటను వేసే సమయం దగ్గరకు వచ్చిన నేపథ్యంలో.. రైతులకు పెట్టుబడి కింద డబ్బులు అందజేయడం అత్యంత ముఖ్యమైన విషయమనీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు.

రైతు దేశానికి వెన్నెముక అనే సంగతి మరిచిపోవద్దని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని నిరూపించుకోవాలని సూచించారు. మాటల్లోనే కాకుండా చేతుల్లోనూ పనులు చేసి చూపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు నాయకులు అల్లకొండ రాజు, నగేష్, రవీందర్ గౌడ్, స్వామి, పిట్టల మహేందర్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.