• పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి
  • కారు పార్టీ సర్కారు మరోసారి రావడం ఖాయమని ధీమా

వేద న్యూస్, సుల్తానాబాద్:
కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల చేతిలో భంగపాటు తప్పదని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పెద్దపల్లిలో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి, కొదురుపాక గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తో పాటు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. గత పాలకులు స్వప్రయోజనం కోసం పనిచేసే అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు.

గత తొమ్మిదిన్నర ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేశారని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కే దక్కిందని వెల్లడించారు.

బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయకు అందిస్తామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6 వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామని స్పష్టం చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి సన్న బియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామని వివరించారు.

ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, జిల్లా రైతు సమితి కో ఆర్డినేటర్ పాల రామారావు, ఎంపీపీ పొన్నామనేని బాలాజీ రావు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బుర్ర మౌనిక – శ్రీనివాస్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ బోయిని రాజ మల్లయ్య , PACS ఛైర్మెన్ జూపల్లి సందీప్ రావు, సూర శ్యామ్ , తిర్రి సాగర్, తిర్రి మధుసూదన్, తూముల రామస్వామి, కనకయ్య, కుమారస్వామి,వార్డు మెంబర్ లు అట్ల వనిత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.