• మాదిగలంతా బీఆర్ఎస్ కే ఓటెయ్యాలి
  • జ్ఞానం వల్లే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించాడు
  • ఎమ్మార్పీఎస్ (టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్

వేద న్యూస్, వరంగల్ :

అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి తప్పడమే కాకుండా మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకు వెళుతున్న బీజేపీ పార్టీకి మాదిగలు మద్దతు ఇవ్వబోమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం వెంకట్రామ జంక్షన్ సమీపంలో ఎమ్మార్పీఎస్ (టీఎస్) కార్యాలయంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు నమిండ్ల చిన్నస్వామి అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశానికి వంగపల్లి శ్రీనివాస్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని అన్నారు.

దళిత బహుజనులకు బీజేపీ వ్యతిరేకం అని ఆరోపించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగాయున్నారు. చదువు వల్ల జ్ఞానం వస్తుందని జ్ఞానం వల్లే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడని అన్నారు. పూలే అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నందున మాదిగలంతా బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని పిలుపునిచ్చారు.

2014, 2018లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ కోసం తీర్మానం చేయడమే కాకుండా స్వయంగా కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని ప్రధాని మోడీని కలిశారని గుర్తు చేశారు. గతంలో వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ మాదిగలను మోసం చేసిందన్నారు.

తెలంగాణ అమరవీరులను గుర్తించిన విధంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ 14 మంది మాదిగ అమరవీరులను గుర్తించి ఆర్థిక సాయం చేశారని తెలిపారు. మాదిగలంతా బిఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కేదాసి మోహన్, పందుల సంజీవ, హన్మకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల అధ్యక్షులు ఇల్లందుల రాజేష్ కన్నా, కొండ్ర ఎల్లయ్య, ఎలుకటి రాజయ్య, గడ్డం భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.