- ఉచిత విద్య, వైద్యం అందించాలి
- విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులు
- ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద ఈ నినాదాలతో ప్లకార్డుల ప్రదర్శన
వేద న్యూస్, హైదరాబాద్/ఖైరతాబాద్:
ప్రజలను ఉచితాలతో మభ్య పెట్టడం సరి కాదని విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్పీ) నాయకులు అభిప్రాయపడ్డారు. మంగళవారం వారు ‘‘ప్రజలకు ఉచిత విద్య, వైద్యం’’ ఇవ్వాలనే డిమాండ్ తో రోడ్డు మీదకు వచ్చారు. ప్రజలకు ముఖ్యమైనది విద్య, వైద్యం అని పేర్కొన్నారు. విద్య, వైద్యం రాష్ట్ర ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో విద్యార్థులు రాజకీయ పార్టీ నేతలు ప్లకార్డుల ప్రదర్శనకు పూనుకున్నారు. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ సిగ్నల్‌లో నాయకులు ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ ప్లకార్డులపై ప్రజలకు ‘‘ఫ్రీ బీస్ వద్దు..ఫ్రీ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్’’ రాసి ఉండగా, వాటిని ప్రదర్శించారు.
ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వీఆర్పీ నేతలు మాట్లాడుతూ విద్యార్థులందరికీ ఉచితంగా విద్య అందిస్తే వారు ఉద్యోగం సాధించి ఆ డబ్బుతో తల్లిదండ్రులను ఆనందంగా చూసుకోవచ్చని చెప్పారు. అదేవిధంగా వారు సంపాదించుకొని ఆర్థికంగా పరిపుష్టి పొందుతారని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం కార్పొరేట్ స్థాయిలో అందించాలని విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
‘‘ఉచిత విద్య, వైద్యం’’పై ప్రజలను చైతన్యవంతులను చేసే పనిలో విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్పీ) ముందుకు కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యార్థుల రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సునీల్ యెచ్చు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇజ్జగిరి కమలాకర్, పాక నవీన్ బాబు, నర్ర సుఖేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఉపాధ్యాక్షులు దండోటికర్ గోపాల్, కార్యదర్శి వగ్గు వినయ్, కుకుడాల మనోజ్ కుమార్, కోషిగ అనికేత్, గోగికర్ అనిల్, బుగ్గ శ్రీకాంత్, నందాల అనిల్ కుమార్, అన్వేష్, సతీష్ పాల్గొన్నారు.