- రెండో చంద్రపూర్‌గా ప్రసిద్ది
- 15 నుంచి 23 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు
- మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల అలంకరణలో ఆలయం
వేద న్యూస్, ఆసిఫాబాద్:
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ ఆలయంలో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. నవరాత్రులలో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శమిస్తుంది.
మొదటి రోజు బాల త్రిపుసుందరీ దేవి, రెండో రోజు గాయత్రి దేవి, మూడో రోజు అన్నపూర్ణ దేవి, నాల్గో రోజు మహా లక్ష్మి, ఐదో రోజు లలిత త్రిపుర సుందరి దేవి, ఆరో రోజు సరస్వతి దేవి, ఏడో రోజు దుర్గా దేవి, ఎనమిదో రోజు మహిషాసుర మర్దిని, తొమ్మిదో రోజు రాజ రాజేశ్వరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.
అంగరంగ వైభవంగా ఉత్సవాలు
ఈ నెల 15 నుంచి 23 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి అదిలాబాద్, నిర్మల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపెల్లి, వరంగల్, ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్ర, నుండి చుట్టూ ప్రక్కల గ్రామాల పట్టణాల ప్రజలు వస్తారు. వారి వారి కోరికలను తీర్చాలని అమ్మవారికి వేడుకుంటూ ముడుపులు కడతారు. అమ్మవారికి నైవేద్యాలు, వొడి బీయ్యాలు, పట్టు వస్త్రాలు, పుట్టు వెంట్రుకలు, మొక్కులు చెల్లించుకుంటారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
ఉత్సవాల నిర్వహణకు ఆలయాన్ని అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాలతో అలంకరించి, చుట్టు పక్కల వెహికల్ పార్కింగ్ కోసం భూమిని చదును చేశారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్, ఆలయ అధ్యక్షులు మోడెమ్ తిరుపతి గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతీ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం అమ్మవారి పల్లకి సేవ ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తరించగలరని అర్చకులు కోరారు.