- వయోవృద్ధులను అందరూ ప్రేమగా ఆదరించాలి
- వయోవృద్ధుల ట్రిబ్యునల్ కోర్టు సభ్యులు అనితారెడ్డి
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
వయోవృద్ధులను అందరూ ప్రేమగా, బాధ్యతగా ఆదరించాలని వయోవృద్ధుల ట్రిబ్యునల్ కోర్టు సభ్యులు, అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ సుబేదారిలో (ఎఫ్ఎంఎం) సాంఘిక సేవా సంస్థ, వనం మహిళా సంఘం సంయుక్తంగా సంఘీభావ దినోత్సవం నిర్వించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేంద్ర రెడ్డి, అనితా రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సిస్టర్ రెజీనా చిన్నప్ప అధ్యక్షత వహించారు.
ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వృద్ధులను, దివ్యాంగులను సంకుచిత భావంతో చూస్తున్నారని వారి సంక్షేమం, రక్షణ అనేది అందరి బాధ్యత అని తెలిపారు. ఈ సంఘీభావన దినోత్సవం నిర్వహించి వారికి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వారి ఆరోగ్య సంరక్షణకు, వారి సంక్షేమానికి కృషి చేస్తున్న ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ, వనం మహిళా సంఘాన్ని ఆయన అభినందించారు.
మీకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి మీకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే నాయిని భరోసా ఇచ్చారు. వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వయో వృద్ధులకు దివ్యాంగులకు అతిథుల చేతుల మీదుగా 300 మందికి దుప్పట్ల పంపిణీ చేశారు. అనితా రెడ్డి మాట్లాడుతూ ఇంకా వయోవృద్ధుల పట్ల, వారి హక్కుల పట్ల, సమాజం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వృద్ధులను ఆదరించాల్సిన కుటుంబ సభ్యులు..వారి ఆదరణకు, పోషణకు సహకరించడం లేదని చెప్పారు. ఎవరైనా వారి కుటుంబ సభ్యులు వృద్ధులను, దివ్యాంగులను హింసించినా, వారి హక్కులకు భంగం కలిగించినా చట్ట ప్రకారం వారి పైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
వృద్ధులకు ట్రిబ్యునల్ కోర్టు ఒక వరం లాంటిదని వెల్లడించారు. మెడికేర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సిస్టర్ రెజినా, వనం మహిళా సంఘం కార్యనిర్వహక అధికారి సిస్టర్ నిర్మల, అధ్యక్షులు లూర్దు మేరీ, కోఆర్డినేటర్లు ఏం అజయ్ కుమార్, కే రవికుమార్ సుందరమ్మ, రాజేశ్వరి, శ్రీకళ, ఎర్ర శ్రీకాంత్, బి.కరుణ వివిధ ప్రాంతం నుంచి వచ్చిన సుమారు 300 మంది వయోవృద్ధులు, వికలాంగులు పాల్గొన్నారు.