- ప్రజెంట్ ఇంగ్లిష్‌కు ఎంతో ప్రాధాన్యత
- మరిపెడ ఎంపీడీవో ధన్ సింగ్
వేద న్యూస్, మరిపెడ:
సీతారాంపురం ఉన్నత పాఠశాలలో ఎల్టా తెలంగాణ ఆధ్వర్యంలో మండల స్థాయి స్పెల్ విజార్డ్ ఇంగ్లిష్ టాలెంట్ టెస్ట్ మహబూబాబాద్ జిల్లా ఎల్టా జనరల్ సెక్రెటరీ బైగాన్ని రామ్మోహన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్టా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల ఆంగ్లభాష ఉన్నతికి ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్ తయారు చేయడం, గ్రామర్ మెటీరియల్, అలాగే స్పెల్ విజార్డ్ , స్టోరీ టెల్లింగ్, డ్రామా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఆ విధంగా విద్యార్థులకు ఆంగ్లం వినడము, మాట్లాడడం, చదవడం, రాయడం లాంటి నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరిపెడ మండల ఎంపీడీవో ధన్ సింగ్ మాట్లాడుతూఈ రోజులలో ఇంగ్లిష్ ప్రాధాన్యత ఎంతో ఉన్నదని చెప్పారు.
అలాంటి ఇంగ్లిష్ సబ్జెక్టుని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పెంపొందించడం కోసం కృషి చేస్తున్న ఎల్టా కృషి అభినందనీయం అని పేర్కొన్నారు. విద్యార్థులు ఆంగ్లము అభివృద్ధి చేసుకున్నట్లయితే సమాజంలో ఎదురయ్యే అన్ని రకాల పోటీ పరీక్షలలో విజయం సాధించి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉన్నదని వెల్లడించారు.
మరొక గౌరవ అతిథి సీతారాంపురం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రామచంద్రు మాట్లాడుతూ ఉన్నత చదువులలో అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లిష్ లోనే ఉంటాయని, ఇంగ్లిష్ ని అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులను కోరారు.
తదుపరి విద్యార్థులకు స్పెల్ విజార్డ్ పరీక్ష నిర్వహించారు. ఇందులో రెసిడెన్షియల్ పాఠశాలలో మోడల్ స్కూల్ విద్యార్థిని ఎస్ తీర్థ ప్రథమ స్థానం పొందారు. నాన్ రెసిడెన్షియల్ పాఠశాలలో జడ్పీహెచ్ఎస్ గుండెపుడి నుండి సిహెచ్. వైష్ణవి ప్రథమ స్థానం పొందారు.
ప్రథమ స్థానం పొందిన ఈ విద్యార్థులు తదుపరి జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో ఫిబ్రవరి 13న మహబూబాబాద్ లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు.ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులకు మెమెంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎల్టా జిల్లా జాయింట్ సెక్రెటరీ భూమా వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ మంగు, గైడ్ టీచర్స్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.