- వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ ప్రావీణ్య
వేద న్యూస్, వరంగల్ :
నేడు జరిగే ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దం చేసినట్లు వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ సిబ్బందికి మూడవ రాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ ఆదివారం ఉ.5 గం.లకు అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారుల సమక్షం లో నిర్వహించడం జరుగుతుందని, శనివారం రెండవ దఫా శిక్షణ అందజేయడం జరిగిందని, కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు మైక్రో అబ్జర్వర్లకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ ఇచ్చామని అన్నారు.
వరంగల్ (తూర్పు), నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ హాల్ లను ఎనుమాముల మార్కెట్ లోని గోడౌన్ నెం 17 వద్ద ఇప్పటికే పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ హాల్ యందు సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు 14 టేబుల్స్ పైన లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని,అదనంగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించడానికి ప్రతి 500 పోస్టర్ బ్యాలెట్స్ కు ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు ఉంటుందని, ప్రతి ఒక టేబుల్ కు ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉంటారని,వారికి ఆర్ ఓ ద్వారా గుర్తింపు కార్డ్ లు అందజేయడం జరిగిందన్నారు.
పోలింగ్ ఏజెంట్స్ ,సిబ్బంది కి వేరు వేరు ప్రవేశ ద్వారాల నుండి అనుమతించ బడునని,
జిల్లాలోని 3 నియోజకవర్గాల ఓట్ల కౌంటింగ్ కోసం సుమారు 250 మంది అధికారులు విధి నిర్వహణలో ఉంటారని, ప్రతి టేబుల్ కు ఒక సూక్ష్మ పరిశీలకుడు, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారని అన్నారు. సెక్యూరిటీ పరిశీలన అనంతరం ఉ 7 గం.లకు లోపలికి అనుమతించ బడతారని, ఆబ్జార్వర్, ఆర్ ఓ లు తప్ప ఎవరికీ కౌంటింగ్ హల్ లోకి మొబైల్ ఫోన్ అనుమతి ఉండదని, బయట ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్ద అందజేసి లోపలికి రావాల్సి ఉంటుందని, పెన్ పెన్సిల్ పేపర్ తప్ప ఏమి కుడా కౌంటింగ్ సెంటర్ లోకి అనుమతించ బడవని, భద్రత కు సంబంధించి పోలీస్ వారి సహకారం తో మూడు అంచెల భద్రత ఏర్పాటు చేయబడిందని తొలి అంచెలో భాగం గా కార్లు,వాహనాలు అక్కడే పార్క్ చేయాల్సి ఉంటుందని, రెండవ అంచేలో స్టేట్ ఆర్ముడ్ ఫోర్స్ (రాష్ట్ర బలగాలు) ఏర్పాటు ఉంటుందని తెలిపారు.
ఇక సెల్ ఫోన్ ఉందా లేదా తనిఖీ జరుగుతుందని ఎలాంటి వస్తువులు వెంట తీసుకువెళ్లడం లేదు అని ధృవీకరణ జరిగిన తర్వాతే అనుమతిస్తారని ,మూడో ఆంచెలో కేంద్ర బలగాలు (సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్) వారు కూడా తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతించ బడుతారని అన్నారు. ఉ.6 గం.లకు ఆబ్జార్వర్, అభ్యర్థుల సమక్షం లో స్ట్రాంగ్ రూం తెరవడం జరుగుతుందని, ఉ.8 గం.లకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుందని, తదుపరి తొలి రౌండ్ లెక్కింపు ప్రారంభం అవుతుందని,అనంతరం రౌండ్ ల వారిగా లెక్కింపు జరుగుతూ ఫలితాలు ఆర్ ఓ ధృవీకరణ (సంతకం) ద్వారా మీడియా కు అందజేయబడతాయని స్పష్టం చేశారు.
జిల్లా పరిధి లోని నర్సంపేట 21 రౌండ్ లు, వర్దన్న పేట 20 రౌండ్లు, వరంగల్ (తూర్పు) నియోజక వర్గానికి 17 రౌండ్ ల లెక్కింపు జరుగుతుందని ఈ సందర్భం గా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్ర స్థాయి లో పరిశీలించి సమర్ధ నిర్వహణకు తగు సూచనలు చేశారు.అంతకుముందు సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎస్. షణ్మగ రాజన్ నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కౌంటింగ్ ఏర్పాట్ల ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్ ఓ లు షేక్ రిజవ్వాన్ బాషా, అశ్విని తానాజీ వాఖెడే, కృష్ణ వేణి, ఏ ఆర్ ఓ లు , నోడల్ అధికారులు ఎన్నికల అధికారులు, తదితరులు ఉన్నారు.