• పోలీస్, రెవెన్యూ అధికారులకు రైతు వేడుకోలు

వేద న్యూస్, డెస్క్:

తన వ్యవసాయ భూమిలోకి తాను వెళ్లడానికి భయంగా ఉందని, పక్కన ఉన్న వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపించారు. బాధితుడు ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామవాసి తనుగుల రాజయ్య తెలిపిన వివరాల ప్రకారం..

మర్రిపల్లి గూడెం గ్రామ శివారులో రాజయ్య కు చెందిన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వేసిన పత్తి పంటలో పత్తి ఏరుటకు గుండేడుకు చెందిన 20 మంది కూలీలు డిసెంబర్ 13, 2024న వచ్చారు. వారిని పలువురు అడ్డుకున్నారు. వెంటనే 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. మరునాడు అనగా డిసెంబర్ 14, 2024న గుండేడు గ్రామానికి వెళ్లి కూలీకి వచ్చిన వారందరినీ మరోసారి అదే వ్యక్తులు బెదిరించారు. దాంతో వారు కూలికి రావడానికి భయపడుతున్నారు.

మూడేండ్ల  నుంచి వ్యవసాయ భూమికి వెళ్లకుండా సదరు వ్యక్తులు(కొడారి ఐలుకొమురయ్య, స్వరూప, తిరుపతి, పెద్దబోయిన రాజేందర్, జ్యోతి, సల్పల కుమారస్వామి) అడ్డుకుంటున్నారనీ, ఎస్సారెస్పీ కాలువను సైతం ఆక్రమించుకున్నారని బాధితుడు ఆరోపించారు. సల్పల కుమారస్వామికి చెందిన ల్యాండ్‌ను కౌలుకు చేస్తున్న సదరు వ్యక్తులు పక్కన ఉన్న రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు బాధితుడు పేర్కొన్నారు.

ఈ విషయమై కమలాపూర్ పోలీసుల వద్దకు వెళితే వారు.. తహశీల్దార్ వద్దకు వెళ్లారని చెప్పగా, అక్కడ కూడా బాధితుడు ఫిర్యాదు చేశారు. కమలాపూర్ పీఎస్, కమలాపూర్ తహశీల్దార్ ఆఫీసర్లతో పాటు ఎస్సారెస్పీ హుజూరాబాద్ ఆఫీసర్లకు  సైతం బాధితుడు కంప్లయింట్ ఇచ్చారు. దయచేసి సంబంధిత శాఖల అధికారులు తన వ్యవసాయ భూమికి వెళ్లుటకు దారి, ఎస్సారెస్పీ కాలువ నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాజయ్య కోరుతున్నాడు. ఎస్సారెస్పీ నుంచి వచ్చే కాలువను పూడ్చి దిగువన ఉన్న రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఆఫీసర్లకు సమర్పించామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని రాజయ్య వేడుకున్నాడు.