వేద న్యూస్, మందమర్రి:
పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు, దివంగత నేత గడ్డం వెంకటస్వామి (కాకా) ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు సోత్కు సుదర్శన్, పుల్లూరు లక్ష్మణ్ లు తెలిపారు. కాకా వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని సింగరేణి మనోవికాస్ పాఠశాల విద్యార్థులకు పండ్ల, బ్రెడ్ పంపిణీ చేశారు.
ముందుగా పాఠశాల ఆవరణంలో కాంగ్రెస్ శ్రేణులు కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన పోలీస్ బుల్లెట్ గాయాన్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలో ఇల్లు లేని పేదలకు సుమారు 80వేల మందికి ఇల్లు ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామికి దక్కుతుందని తెలిపారు.
సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోయి దివాలా తీసే దశలో ఉండగా సంస్థకు వందల కోట్ల ఇప్పించి సంస్థను కాపాడిన గొప్ప నాయకుడని, అదేవిధంగా సింగరేణి కార్మికులకు రిటైర్మెంట్ అయ్యాక వారి జీవితాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పెన్షన్స్ స్కీంను సైతం అమలు చేయించిన ఘనత కాకా వెంకటస్వామికి దక్కుతుందని తెలిపారు. ఎల్లప్పుడూ కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకున్న గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి అని కొనియాడారు.
ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు నేరువట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మండ భాస్కర్, ఐఎన్టియుసి నాయకులు దేవి భీమయ్య, కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్, మంద తిరుమల్ రెడ్డి, నామిని ముత్తయ్య, ఎండీ పాషా, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.