– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

వేద న్యూస్, పాపన్నపేట :

అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు కావలసినంత గ్యాస్ సరఫరా అందించబడుతుందని, అపోహలకు గురికాకుండా అవసరమైన మేరకే సిలిండర్లు బుక్ చేసుకోవాలని సూచించారు. బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉందని ఎక్కడా నమోదు కాలేదని, బ్లాక్ మార్కెటింగ్ లేదా అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో 810 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా రోజుకు 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందని ఆయన వివరించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా సమన్వయ కమిటీలతో రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించే విధంగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు మళ్లీ విజ్ఞప్తి చేస్తూ, నగర ప్రాంతాల్లో 25 రోజులకొకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల్లో ఒకసారి ఎల్‌పీజీ సిలిండర్లు బుక్ చేసుకోవాలని, అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయొద్దని మంత్రి తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు. ప్రజల అవసరానికి సరిపడా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి అసత్య వార్తలకు ప్రజలు అలజడి చెందకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీ రమాదేవి, జిల్లా పౌరసరపాల అధికారి నిత్యానంద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *