– హైదరాబాద్ జిల్లాలోని 2001 బ్యాచ్ ఉద్యమకారుల తీర్మానం
– త్వరలో తీర్మాన ప్రతిని సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు సమర్పిస్తాం: ఉద్యమకారులు
– మహేందర్‌కు అవకాశమిస్తే గెలుపునకు కృషి చేస్తామని ఉద్యమకారుల హామీ
– రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ ఖాయం: ఆర్ వీ మహేందర్ ధీమా

వేద న్యూస్, గోషామహల్:
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమ నేత ఆర్ వీ మహేందర్ కుమార్ కు గోషామహల్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించాలని పార్టీ అధిష్టానానికి హైదరాబాద్ జిల్లాలోని 2001 బ్యాచ్ ఉద్యమకారులు విజ్ఞప్తి చేశారు. ఆర్ వీ మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో కాచిగూడ శ్రీ కృప హోటల్ లో ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో శుక్రవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్‌వీఎం అధ్యక్షతన హైదరాబాద్ జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు చెందిన 2001-బ్యాచ్ ఉద్యమకారులు వంద మందికిపైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ వీ మహేందర్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఉద్యమకారులంతా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు 

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అణగారిన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ‘దళిత బంధు’, ‘బీసీ బంధు’, ‘రైతుబంధు’ పథకాలతో పాటు రైతులకు రుణమాఫీ చేసి..పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ‘డబుల్’ ఇండ్లను నిర్మించి నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేస్తోందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడించారు. ఇది చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు తెలంగాణ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్, బీజేపీల ఉచ్చులో పడి ఆగం కావద్దని సూచించారు. సీఎం కెసిఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సుశిక్తులైన సైనికుల్లా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం పాటుపడాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మహేందర్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మహేందర్ విశేష కృషి

అనంతరం 2001 బ్యాచ్ ఉద్యమకారులు జిల్లెల్ల శ్యాంసుందర్ రావు, రాజా వర్ధన్, రామకృష్ణ, వేణుగోపాల్, సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం చేసిన ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని వాపోయారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చిన వారికే పెద్ద పీట వేసి ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో అయినా ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని ఆశించామని, పార్టీ అధినాయకుడు సిట్టింగ్ లకే పార్టీ టికెట్లు కేటాయించడం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి పార్టీ అధిష్టానం ఇంకా అభ్యర్థిని ప్రకటించనందున..గోషామహల్ నియోజకవర్గంలో 21 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి విశేషమైన కృషి చేస్తున్న ఆర్ వీఎంకు టికెట్ ఇవ్వాలని కోరారు.

సొంత డబ్బులు వెచ్చించి ఆర్ వీఎం గెలుపునకు కృషి చేస్తాం
ఆర్ వీ మహేందర్ కుమార్ కు బీఆర్ఎస్ పార్టీ గోషామహల్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తే గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల ఉద్యమకారుల బృందమంతా ఆర్ వీ  మహేందర్ విజయం కోసం పాటు పడతామని హామీనిచ్చారు. అవసరమైతే తమ సొంత డబ్బులు వెచ్చించి ఆర్ వీ మహేందర్ కుమార్ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఆర్ వీ మహేందర్ కుమార్ కు గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలని తీర్మానించారు. త్వరలో ఆ తీర్మాన ప్రతిని సీఎం కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో 2001 తెలంగాణ ఉద్యమకారులు ప్రశాంత్, శ్రవణ్, గంగా కిషన్, అమర్ నాథ్ రెడ్డి, శ్రీనివాస్, మోహన్ రావు, తోట శ్రావణ్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొన్నారు.