వేద న్యూస్, వరంగల్ : 

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగా పురోభివృద్ధికి పెద్దపేట వేస్తున్నదని రాష్ట్ర పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఖిలా వరంగల్లోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్కులు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని, నగర మేయర్ గుండు సుధారాణి, ఎంఎల్ సి అలుబెల్లి నర్సిరెడ్డి , జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, బడిబాట కార్యక్రమం గోడ ప్రతిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపడుతున్నదని, అందులో భాగంగా కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపుతుందన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన వసతులతో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో వసతులు, సదుపాయాలతో పాటు బోధనలో విప్లవాత్మక మార్పులకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఎందరో ఉన్నత శిఖరాలు సాధించారన్నారు. తాను, వరంగల్ జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే అని మంత్రి గుర్తు చేశారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలను సెమి రెసిడెన్షియల్ స్కూల్స్ గా చేయుటకు ముఖ్యమంత్రి ఆలోచన లో ఉందని అన్నారు. అమ్మల భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటుచేసి పాఠశాలల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. దీంతోపాటు మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మహిళలచే యూనిఫాంలో కుట్టించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసి వారిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా చూడాల్సిన గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో 20 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.అనంతరం ఎమ్మెల్సీ అలుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడులు నిలబడాలి అన్నారు. విద్యతోనే అంతరాలు పోవాలని, ఆర్థిక సామాజిక అంతరాలను తగ్గించేది విద్య అని తెలిపారు. చదువును కొనకండి, చదువుకోండని, ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించాలని కోరారు. బడులలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలతో కాక స్వయంగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బడులు ప్రారంభమైన బుధవారం రోజున ప్రభుత్వ నుండి అందిన 2.15 లక్షల పాఠ్య, 2.48 లక్షల నోట్ బుక్ లతో పాటు మహిళ సంఘాలచే కుట్టించిన 38 వేల ఏకారుప దుస్తులు విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించిన సుమారు 448 పాఠశాలల అభివృద్ధి పనులలో 130 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తయ్యాయని, మిగిలిన పాఠశాలల్లో 90 శాతం పనులు పూర్తయినాయని, వారంలోగా వంద శాతం పుర్తవుతాయని అన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న ఐదేళ్ల పై బడిన 7 వేల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లలను నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే నమోదు చేసేలా విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. అనంతరం మంత్రి, మేయర్, ఎమ్మెల్సీ, కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్కులు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఈ ఓ వాసంతి,విద్యాశాఖ అధికారులు, మెప్మా, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.