వేద న్యూస్, జమ్మికుంట:

సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించగలరని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి నిరూపించారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయం కేశవపురం పూర్వ విద్యార్థి సింగ కృష్ణ మోహన్ రాజు.

సర్కారీ కొలువు సాధించాలనే సంకల్పంతో అకుంఠిత దీక్షతో పోటీ పరీక్షలకు సన్నద్ధమై.. ఎన్నో ఒడిదుడికులు ఎదుర్కొని.. ప్రైవేటు టీచర్‌గా కొన్ని రోజులు పని చేశారు. టీజీపీఎస్సీ(తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఇటీవల రిలీజ్ చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ మోహన్ ‌రాజును స్నేహితులు, బంధువులు అభినందిస్తున్నారు.

సింగ మాధవీలత-భిక్షంరాజు దంపతుల తనయుడైన కృష్ణ మోహన్ రాజుకు.. చిన్న నాటి నుంచి పుస్తకాలంటే అమితమైన ఆసక్తి. ముఖ్యంగా మహనీయులు, గొప్ప వారి జీవిత చరిత్రలను ఇంట్రెస్ట్‌గా చదువుతుంటారు. ఈ క్రమంలోనే వారి నుంచి స్ఫూర్తి పొంది పోటీ పరీక్షలకు అకుంఠిత దీక్షతో సన్నద్ధమై.. సత్తా చాటారు.

హన్మకొండ ఎస్ఆర్ కాలేజీలో ఇంటర్, వాగ్దేవి డిగ్రీ, పీజీ కాలేజీలో డిగ్రీ.. ఫాతిమా కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్‌లో డీఈడీ, లష్కర్‌బజార్ ప్రభుత్వ కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ చదివారు. అనంతరం ప్రైవేటు‌గా అధ్యాపకుడిగా పని చేస్తూనే..ప్రభుత్వ కొలువు సాధించాలనే తపనతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. హుజూరాబాద్ శిశుమందిర్, జమ్మికుంట శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయంతో పాటు బీమారం శివానీ హై స్కూళ్లలో ప్రైవేటు టీచర్‌గా వర్క్ చేస్తూనే.. కృష్ణ మోహన్ రాజు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యారు.

గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా కొలువు
సర్కారీ నౌకరీ అనేది ప్రతి ఒక్కరి కలల కొలువు. కాగా, అందుకు చాలా శ్రమించాలనేది నిర్వివాదాంశం. పోటీలో నిలబడి తట్టుకుని విజయం సాధించాలనే చాలా అంటే చాలా కష్టపడి, ఇష్టపడి, ఎక్కడా నిరాశ, నిస్పృహలకు తట్టుకుని ఆశావాద దృక్పథంతో చదువుపైన దృష్టి సారించాలి. ఆ మేరకు కృష్ణ మోహన్ రాజు.. ఎంతో దీక్షతో చదివి.. చదువుకున్న విషయాలను సంపూర్ణంగా అవగాహన చేసుకున్నారని చెప్పొచ్చు. ఇటీవల రిలీజ్ చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల ఫలితాల్లో కృష్ణ మోహన్ రాజు‌ 300 మార్కులకు 189.40 మార్కులు సెక్యూర్‌ చేసి సర్కారీ కొలువు సాధించడం విశేషం.

నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తా: కృష్ణ మోహన్‌రాజు
పరకాల హనుమకొండ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. హాస్టల్స్‌లో వసతుల కల్పనతో పాటు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహారపదార్థాలు స్టూడెంట్స్‌కు అందేలా నా పరిధి మేరకు శక్తి వంచన లేకుండా పని చేస్తాను. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు, వారి అభివృద్ధి నా శక్తి, పరిధి మేరకు కృషి చేస్తాను. ఆ మేరకు నా బాధ్యతలను నిర్వర్తిస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *