•  నా మాట వినాలి లేదంటే మార్కెట్‌లో  పని లేదు అంటూ బెదిరిస్తున్న సుధాక శంకరులు
  •  బండ్లమోత హమాలీ అధ్యక్షుడు జన్ను సాల్మన్ ఆరోపణ

వేద న్యూస్, వరంగల్:

ఆసియా ఖండంలోనే రెండో  పెద్దదైన వరంగల్ జిల్లాకేంద్రంలోని ఏనుమాముల మార్కెట్‌లో  బండ్లమోత కార్మికులకు కన్నీరే మిగులుతోందని, హమాలీలకు అన్యాయం జరుగుతోందని బండ్లమోత హమాలీ అధ్యక్షుడు జన్ను సాల్మన్ తెలిపారు. గురువారం ఆయన మార్కెట్ లో మీడియాతో మాట్లాడారు. హమాలీలకు రావలసిన పనిని,డబ్బులను, కమిటీ పెద్ద లైన సుధాక శంకరులు ఇవ్వడంలేదని ఆరోపించారు. తమకు ఇవ్వవలసిన ఉచిత బట్టలను సైతం డబ్బులకు అమ్ముకుంటున్నారని,  సభ్యత్వం అంటూ డబ్బులను సైతం అక్రమంగా హమాలీల నుండి వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

హమాలీల గోదాములను వేరే వారికి లీజుకి ఇచ్చి బయట వారితో పని చేపిస్తూ వారి వద్ద నుండి కమీషన్ ను  తీసుకుంటున్నారని విమర్శించారు.  గోదాంపై సంవత్సర ఆదాయం సైతం సుధాక శంకరులే వారికి ఇష్టం వచ్చిన వారితో పంచుకుంటున్నారని పేర్కొన్నారు. హమాలీలకు తెలియకుండా గోదాంలను వేరే వారికి ఇవ్వకూడదని అన్నందుకు తనను సైతం పక్కన పెట్టారని, ఎవరితో చెప్పుకొని ఏం చేస్తావో చేసుకో అంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. 

హమలీలకు పని కల్పించకుండా వారికి అన్యాయం జరుగుతోందని ఆయన మండి పడ్డారు. హమాలీలకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి దుస్తువులు ఇప్పటివరకు హమాలీలకు ఇవ్వలేదని తెలిపారు.  గోదాములలో అవి చెదలు పట్టి పోతున్నాయని, ఆ గోదాం ఇన్ చార్జి, శంకరులు వాటిని డబ్బులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

హమాలీలకు సరియైన వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా సదరు మార్కెట్ చైర్మన్, అధికారులు స్పందించి హమాలీలకు జరిగేలా చూడాలని, అన్యాయాలను అరికట్టాలని కోరారు. హమాలీల సమస్యలపై త్వరగా పరిష్కారం చూపాలని అధికారులకు విన్నవించుకున్నారు . లేనిపక్షంలో ధర్నాలు చేయడానికి కూడా వెనుకాడబోమని  సాల్మన్ స్పష్టం చేశారు.