Oplus_131072

సమస్యల వలయంలో శ్రీరాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
– రోగులపాలిట శాపంగా మారిన వైనం
– కొన్ని నెలలుగా పని చేయని ఎక్స్రేరే
– నామమాత్రంగానే టెస్టులు!
– ఇష్టానుసారంగా డ్యూటీలు ?
– కంపు కొడుతున్న మరుగుదొడ్లు
– జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణ కరువు?

వేద న్యూస్, పెద్దపల్లి :

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారుల జాడ కనిపిస్తలేదు. ఆరోగ్య సిబ్బందిని అడిగే వారు లేక.. వచ్చిన వారికి వైద్యం అందక రోగులు అల్లాడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంరోగుల పాలిట శాపంగా మారింది. అరకొర వసతులుతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఎక్స్రే రే విభాగానికి చెందిన మిషన్ పనిచేయకపోవడంతో పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా టెక్నీషియన్ ఉద్యోగిని సైతం వేరే చోటుకు స్థాన చలనం కల్పించారని సమాచారం.

ఇకపోతే ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయని బోర్డు పట్టికలో మాత్రమే దర్శనమిస్తాయి. కానీ కొన్ని మాత్రమే  పరీక్షలు చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. అలా చేయడం వల్ల పరీక్షలు లేట్ అవ్వడంతో తమ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ప్రైవేట్ ల్యాబ్ లకు వెళ్లి అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల విధి నిర్వహణ లోపాలు కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రివేళ అత్యవసర  సమయాల్లో స్టాఫ్ నర్సులతోనే నడుస్తుంది తప్ప డాక్టర్స్ డ్యూటీలో ఉండడం లేదని అరోపణలు సైతం బలంగా వినిపిస్తున్నాయి.

అసలు ఇది ఆసుపత్రినా?
ఆసుపత్రికి సంబంధించిన ఎమర్జెన్సీ వాహనాలు రోగులకు కాకుండా తమ సొంత పనులకు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపాలు కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మరుగుదొడ్లను చూస్తే వాంతులు వచ్చేలా ఉందని అసలు అటువైపుగా నడవాలి అన్న రోగులు, రోగుల బంధువులు జంకుతున్నారు. రోగులకు రోగం నయమవ్వడం ఏమో కానీ లేని రోగాలు వచ్చేలా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. ఆసుపత్రికి సంబంధించిన అన్ని రకాల నిర్వహణ కార్యకలాపాలు ఎప్పటికప్పుడు జిల్లా వైద్యాధికారి పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై దృష్టి సారించి రోగులకు అందుబాటులో మెరుగైన సేవలు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.