వేద న్యూస్, డెస్క్ :
భారత దేశంలో జనవరి 22 వెరీ స్పెషల్ డే గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజున అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈనేపథ్యంలో జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లో సెలవు ప్రకటించారు. ఆ రోజున పలు విదేశాల్లో కూడా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. మారిషస్ ప్రభుత్వం జనవరి 22న మధ్యాహ్నం రెండు గంటల నుంచి హిందూ అధికారులకు ప్రత్యేక సెలవు ప్రకటించింది.
దీంతో వారు కూడా సమీపంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనే వీలు కలిగింది. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ నేతృత్వంలోని మారిషస్ క్యాబినెట్ శుక్రవారమే దీనిపై నిర్ణయాన్ని తీసుకుంది. ‘‘భారతదేశంలోని అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం హిందూ అధికారులకు ఒక కీలకమైన ఘట్టం. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఎంతో ముఖ్యమైన కార్యక్రమం’’ అని మారిషస్ క్యాబినెట్ ప్రకటించింది.
ఇక అమెరికా, కెనడా, బ్రిటన్, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్‌లలోని హిందూ ఆలయాల్లోనూ జనవరి 22న ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో అక్కడి పలు కంపెనీలు జనవరి 22న మధ్యాహ్నానికి ముందే ఆఫీసు నుంచి వెళ్లిపోయే వెసులుబాటును హిందూ వర్గానికి చెందిన ఉద్యోగులకు కల్పించాయి. కొన్ని చోట్ల స్కూళ్లకు కూడా హాలిడే ఇచ్చారు.
కాగా శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 22న అయోధ్య రామాలయ గర్భగుడిలో ప్రతిష్టించబోతున్నారు. అయోధ్యలోని మహా ఆలయ ప్రారంభోత్సవానికి అన్ని రంగాలకు చెందిన పలువురు నేతలు, ప్రముఖులను ఆహ్వానించారు. కోట్లాది మంది రామభక్తులు ఈ కార్యక్రమాన్ని టీవీ ఛానళ్లలో వీక్షిస్తారు. ఈనేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జనవరి 22వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆ రోజున మద్యం దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 22వ తేదీన మద్యం దుకాణాలను మూసివేయాలని రాష్ట్రంలోని అందరు ఎక్సైజ్ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్‌లకు ఎక్సైజ్ శాఖ లేఖ రాసింది.
కాగా, అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ జరిగే 22న సెలవుదినంగా ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రతి గ్రామంలో ఆ రోజున పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి సెలవు ఇవ్వాలని సంఘం అధ్యక్షుడు కే హనుమంతరావు, ప్రధాన కార్యదర్ళి నవత్ సురేశ్ కోరారు.