వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
సంక్రాంతి పండుగకు పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. పండగకు ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మట్వాడ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర్లు పలు సూచనలు జారీ చేశారు.
సంక్రాంతి పండుగ సీజన్‌లో దొంగల చోరీల నియంత్రణకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, షాపింగ్ మాల్‌లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. ఎక్కువ రోజులు ఊర్లకు వెళ్లేవారు తమ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళకు తమ ఇంటిని గమనిస్తు ఉండమని చెప్పాలి.
విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టకూడదు. ద్విచక్రవాహనాలు, కారులను రోడ్లపై పార్క్ చేయకూడదు. తమ ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి. బీరువా తాళాలను తమతోపాటే తీసుకెళ్లాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేసుకోవాలి.
అలాగే ఇంటి మొత్తం చీకటిగా ఉంచకుండా ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి. ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్, పాలప్యాకెట్లు అధిక సంఖ్యలో జమ అయితే.. ఆ ఇంట్లో ఎవరూ లేరనే సంకేతం దొంగలకు సులువుగా అందుతుంది. కాబట్టి అవి ఎక్కువ మొత్తంలో జమకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పని మనుషులు ఉంటే రోజూ చెత్త ఊడ్చమని చెప్పాలి.
విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోకూడదు. ఇంటి పరిసరాల్లో పార్క్ చేసిన వాహనాలకు హాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ వేయాలి. తమ ఇళ్లకు వాచ్‌మెన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
ఇంట్లో బంగారు నగలు, నగదు వంటి విలువైన వస్తువులు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం మంచిది. లేదంతే తమతోపాటే వాటిని తీసుకెళ్లాలని సూచించారు.ఎవరికైనా ఇలాంటి వ్యక్తులైన అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 డయల్ చేయాలని తెలిపారు.