- మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించాలి
- జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న
వేద న్యూస్, కరీంనగర్:
జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూప రాణి జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి, మహిళా సంఘం సభ్యులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వరూప రాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం కోటి మంది మహిళలను కోటీశ్వరలను చేయడంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించినట్టు వెల్లడించారు.
జమ్మికుంట పట్టణ పరిధిలో ఈ క్యాంటీన్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని మహిళా సంఘం సభ్యులకు సూచించారు. బ్యాంకు నిధులతో పాటు స్త్రీ నిధి మహిళా సంఘ సభ్యుల సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ తో క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రైమ్ ఏరియాలో హాస్పిటల్స్ కు సమీపాన ఉన్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లో కస్టమర్లకు అన్ని రకాల సదుపాయాలతో.. నాణ్యత ప్రమాణాలు ఉన్న ఆహార పదార్థాలను అందించి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. మహిళా సంఘ సభ్యులకు గ్రూపుల వారీగా, వ్యక్తిగతంగా బ్యాంకర్ల సాయంతో నిధులను అందిస్తున్నట్టు వివరించారు.
వ్యక్తిగతంగా రూ.2.25 నుంచి రూ. 3.5 లక్షల వరకు, గ్రూపుల వారీగా రూ. 40 లక్షల వరకు ఫండ్స్ ను అందించనున్నట్టు స్పష్టం చేశారు. గ్రూప్ యాక్టివిటీస్ లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్, ఈవెంట్ మేనేజ్ మెంట్ వంటి వాటిని ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో గ్రూప్ యాక్టివిటీస్- 9 , వ్యక్తిగతంగా ప్రోత్సాహం-15 టార్గెట్ ను నిర్దేశించుకున్నట్టు చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు వెల్లడించారు.
జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర సర్కారు మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావడానికి రుణాలను అందిస్తున్నట్టు తెలిపారు. మహిళా సంఘాలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మహిళా సంఘాలు ఏర్పాటు చేసే ఈ క్యాంటీన్ల ద్వారా ఆర్థికంగా నిలదుకపోవడంతో పాటు మరి కొంతమందికి ఉపాధి ఇచ్చే స్థాయికి మహిళా సంఘాలు ఎదుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో మెప్మా జిల్లా కోఆర్డినేటర్ శ్రీవాణి, ఇన్ చార్జి టీఎంసీ మానస, డిపిఓ సతీష్ , కౌన్సిలర్ సాయిని రమ, జమ్మికుంట మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.