• ఇంటర్ విద్యా జిల్లా ప్రత్యేక అధికారి టి. యాదగిరి గౌడ్.

వేద న్యూస్, వరంగల్:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 425 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 90 రోజుల ప్రత్యేక ప్రణాళికను పక్కాగా అమలు చేసి, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి కృషి చేయాలని ఇంటర్ విద్యా జిల్లా ప్రత్యేక అధికారి టి యాదగిరి గౌడ్ అన్నారు.

మంగళవారం హన్మకొండ జిల్లా లోని శాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను,జిల్లా ఇంటర్ విధ్యాధికారి ఏ గోపాల్ తో కలిసి ఆయన సందర్శించారు. కళాశాల తరగతి గదులు, ల్యాబరేటరీలు, సందర్శించి అధ్యాపకులు,విద్యార్థులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి, కళాశాలలో ఫలితాలు పెంచుటకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఇంటర్ విద్యా జిల్లా ప్రత్యేక అధికారి టి యాదగిరి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేయడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య చేపట్టిన చర్యలను విద్యార్థులు, అధ్యాపకులు పక్కాగా పాటించి, ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. రాబోయే వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని, కళాశాలలో నిర్వహించే స్టడీ అవర్స్ ను విద్యార్థులందరూ వినియోగించుకొని, తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

కళాశాలకు హాజరు కాని లేదా తక్కువ శాతం హాజరు ఉన్న విద్యార్థులను, మొబైల్ సహాయంతో వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని కళాశాలకు రప్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.

అదేవిధంగా చదువులో వెనకబడ్డ విద్యార్థుల కోసం స్పెషల్ క్లాసులు తీసుకోవడంతో పాటు కళాశాలలో స్టడీ అవర్స్ నిర్వహించాలని ప్రిన్సిపాల్, అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కోటేశ్వర్,అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.