వేద న్యూస్, జగిత్యాల : 

తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం (2025-2026) నుండి ఇంటర్మీడియట్ ఆర్ట్స్ విభాగంలో హెచ్.సి.ఈ.సి.కోర్సు ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందని చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. పోతరవేణి తిరుపతి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ ఆవరణంలో శుక్రవారం రోజున చరిత్ర జూనియర్ లెక్చరర్ల ఆత్మీయ సమావేశంకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ 1976 నుంచి ఇంటర్మీడియట్ విద్యలో ప్రవేశపెట్టిన సాంప్రదాయ కోర్సులే నేటికీ కొనసాగడం శోచనీయమని పేర్కొన్నారు.

ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా సాంప్రదాయ ఆర్ట్స్ కోర్సులైన హెచ్.ఇ.సి,

సి.ఈ.సి. గ్రూపులను కలిపి హెచ్.సి.ఇ.సి.( చరిత్ర, కామర్స్, అర్థ శాస్త్రం, రాజనీతి శాస్త్రం సబ్జెక్టులతో ) నూతన కోర్స్ రూపకల్పన చేసి ప్రవేశపెట్టినట్లయితే చరిత్ర సబ్జెక్టులో రాణించిన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల వైపు, కామర్స్ లో రాణించిన విద్యార్థులు ప్రైవేటు రంగం వైపు దూసుకెళ్లే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఈ నూతన ఆర్ట్స్ కోర్సు ప్రవేశ పెడితే ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో స్థిరపడుటకు దోహద పడుతుందన్నారు. చరిత్ర పరిరక్షణ సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు కొత్తూరి మహేష్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశపెట్టిన సాంప్రదాయ ఆర్ట్స్ కోర్సులు కొన్ని దశాబ్దాల నుండి కొనసాగుతున్నప్పటికీ, వాటిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయకపోవడం వలన జూనియర్ కళాశాలలో రోజురోజుకు అడ్మిషన్ల సంఖ్య తగ్గుతున్నాయని అధ్యాపకులు వాపోతున్నారు. అలాగే సాంప్రదాయ కోర్సులను అభ్యసించిన విద్యార్థులు ఆధునిక అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

కావున విద్య సమూల ప్రక్షాళలో భాగంగా ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు, విద్యాధికారులు, మేధావులు చొరవ తీసుకొని ఇంటర్మీడియట్ లో హెచ్.సి.ఈ.సి. అనే నూతన కోర్సును ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చరిత్ర జూనియర్ లెక్చరర్లు సుదర్శన్, నరేష్, రామ్ ప్రసాద్, దేవేందర్, నిర్మల, రజిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.