•  సబ్ రిజిస్ట్రార్ కంటే పవర్ ఫుల్..!
  •  నగరంలోని ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రైవేటు వ్యక్తి హవా!?

వేద న్యూస్, వరంగల్ :

స్టేట్ లో ఏ సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లినా..కార్యాలయానికి ఎదుట 50 నుంచి 100 మీటర్ల దూరంలో అటూ ఇటూ ఒకట్రెండు టేబుళ్లు, కంప్యూటర్లు పెట్టుకుని, మూడు నాలుగు కుర్చీలున్న చిన్న చిన్న షాపులు కనబడతాయి. పొద్దంతా ఏదో హడావుడి కనిపిస్తుంటుంది. చూడటానికి సింపుల్‌ గానే ఉన్నా ఇండ్లు, ఫ్లాట్లు, భూములు..ఇలా ఏ రిజిస్ట్రేషన్లు జరగాలన్నా ఆ చిన్న దుకాణాలు, వాటిని నిర్వహించే డాక్యుమెంట్‌ రైటర్లే కీలకం..ఒక్క మాటలో చెప్పాలంటే.. రిజిస్ట్రేషన్లు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో జరుగుతున్నా 95 శాతం పని ఈ డాక్యుమెంట్‌ రైటర్ల వద్దే అయిపోతుంది అన్నమాట..నిబంధనల ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోకి కొనుగోలు, అమ్మకం దారులు, సాక్షులు మినహా ఇతర ప్రైవేటు వ్యక్తులు, డాక్యుమెంట్‌ రైటర్లను అనుమతించకూడదు.

కానీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ సిబ్బంది కంటే.. ఈ మధ్యవర్తుల హడావుడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వరంగల్ నగరంలోని ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఓ డాక్యుమెంట్ రైటర్ హవా మామూలుగా లేదట. ఈయన తలుచుకుంటే లిటిగేషన్ ఉన్న భూమి అయినా సరే రిజిస్ట్రేషన్ అయిపోతుందని వినికిడి. సబ్‌ రిజిస్ట్రార్‌ మాట కంటే ఈయన మాటకే ఎక్కువ విలువిస్తారట. ఈయన చెప్పిందే వేదం.. ఇచ్చిందే మహా ‘ప్రసాదం’గా తీసుకుంటూ పనులు చకచక చేస్తారని అరోపణలు లేకపోలేదు.

ఆయనను కాదంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఫైళ్లు ముందుకు కదలని పరిస్థితి ఉందంటే ఆయనకు ఎంత పరపతి ఉందో చెప్పనక్కర్లేదు. ఆయనను కాదని వెళితే.. అధికారులు కొర్రీలు పెడుతూ రిజిస్ట్రేషన్ చేసుకునే వారిని తిప్పించుకుంటూ ఉంటారనీ పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియడం లేదంటూ సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పైన సంబంధిత ఉన్నత అధికారులు దృష్టి సారించి ప్రజలకు రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్థిక భారం కాకుండా న్యాయం జరిగేలా చూడాలని పలువురు వేడుకుంటున్నారు.