• మా సమస్యలు తీర్చేదెవరు..?: వాపోతున్న గ్రామస్తులు

వేద న్యూస్, డోర్నకల్/మరిపెడ:

ఎలమంచిలి తండా గ్రామపంచాయతీలో చినుకు పడితే చాలు.. మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయి గ్రామస్తులకు నరకం చూపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న దుస్థితి ప్రస్తుత ప్రభుత్వంలోనూ కొనసాగుతుండటంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితి అంగన్‌వాడి కేంద్రానికి వెళ్లే చిన్నారులకు పెద్ద సమస్యగా మారింది. బురదమయమైన దారుల్లో చిన్నారులు నడవాలంటే జారి పడిపోతామేమోనన్న భయం వెంటాడుతోంది. అంతేకాదు, ఎలమంచిలి తండా గ్రామపంచాయతీ కార్యాలయం కూడా నీట మునిగిపోవడంతో పనుల నిమిత్తం వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొన్ని రోజులుగా నిల్వ ఉన్న నీటి కారణంగా దుర్వాసన వెదజల్లుతోందని, దోమల బెడద ఎక్కువై ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సమస్యను పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు ఇకనైనా స్పందించి, నిలిచిపోయిన నీటిని బయటకు పంపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, తద్వారా తమ కష్టాలు తీర్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని, తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తాము భావిస్తున్నట్టు పలువురు గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.