• హుజురాబాద్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులు మధు ధీమా

వేద న్యూస్, హుజురాబాద్:

హుజురాబాద్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానినని ఎన్ఎస్‌యూఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నాగ మధు యాదవ్ అన్నారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరిగిన ఆదరణను పూర్వలేక బీఆర్ఎస్, బీజేపీ నాయకులు..కాంగ్రెస్ నాయకుల ఇండ్లపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

డ్యాముల పేరుతో స్కాములు, ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఏడుసార్లు హుజురాబాద్ నియోజకవర్గం నుండి గెలిచిన ఈటల రాజేందర్ హుజురాబాద్ కు చేసింది ఏమీ లేదని విమర్శించారు. నేడు (బుధవారం) జమ్మికుంట పట్టణంలో నిర్వహించే కాంగ్రెస్ ‘విజయభేరి’ సభకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు తిప్పారపు సంపత్, హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత తదితరులు పాల్గొన్నారు.