వేద న్యూస్, వరంగల్: 

స్వాతంత్ర్యాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బిజెపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలు తమ హక్కులు కోల్పోతారని, అంబానీ, అదానీలు చేతుల్లో దేశం ఆగమవుతుందని ఆరోపించారు. నియంతృత్వ బిజెపి ప్రభుత్వం కావాలో లేక ప్రజా సంక్షేమానికి పాటుపడే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో ప్రజలు విచక్షణతో ఆలోచించాలని మంత్రి కొండా సురేఖ ప్రజలకు కోరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని తూర్పు కోటలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో మంత్రి సురేఖ పాల్గొని మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందిపెట్టారనే వాస్తవాన్ని బిఆర్ఎస్ నాయకులు గ్రహించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతను చాటుకున్నదని మంత్రి స్పష్టం చేశారు. అంతలోనే ఎలక్షన్ కోడ్ వచ్చిన విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ఎలక్షన్ కోడ్ ఎత్తివేయగానే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పునరంకితమవుతుందని స్పష్టం చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే బిఆర్ఎస్ నాయకులకు మెదడు మోకాళ్ళ నుంచి అరికాళ్ళకు వచ్చిందని విమర్శించారు. అధికారం కోల్పోయినా వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదని ప్రజల మద్దతు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లో పలుచన చేయాలని ఎన్నో కుతంత్రాలు చేస్తున్నారని మంత్రి సురేఖ మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారీ వర్షాలతో  రైతులు పంటను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా రైతులను అసలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ళ పాలనలో ప్రజా ధనాన్ని దోచుకొని, అవసరార్థులకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని చేతకాని పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న కవిత ఇప్పుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నదని, ఇంకా జైలు బాట పట్టే నాయకులు వచ్చే రోజుల్లో బయటపడతారని మంత్రి స్పష్టం చేశారు. బిజెపి ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పటికీ దేశంలో ఆశించిన మార్పు రాలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో రూ. 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. నోట్ల రద్దు చేసి ప్రజలను రోడ్ల పై నిలబెట్టిన ఘనత మోడీకే దక్కుతుందని అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లకు కొర్రీలు పెట్టి ఆగం చేస్తుందని అన్నారు.  రాజకీయాల కోసం అయోధ్యలో దేవాలయం పూర్తికాకుండానే కేవలం బాలరామున్ని ప్రతిష్టించి హిందువుల మనోభావాలను మోడీ గాయపరిచారని అన్నారు. ప్రజలను దేవుళ్ళుగా భావించే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే దేశం పురోగమిస్తుందని లేకపోతే మోడీ, కేసీఆర్ వంటి నియంతృత్వ పాలకుల చేతిలో దేశం ఆగమవుతుందని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించి,  ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.