- ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా..
- 300 మంది పై చిలుకు పేషెంట్స్‌కు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
వేద న్యూస్, జమ్మికుంట:
వ్యాపార దృక్పథంతో అందిన కాడికి డబ్బులు దండుకుంటున్న కొన్ని ఆస్పత్రుల నిర్వాకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి తరుణంలో ‘వైద్యో నారాయణ హరి’ అన్న నానుడికి నిజమైన అర్థం చెప్పేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు ‘సంజీవని’ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్య నిర్వహణలోని వైద్యులు. ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించడమే కాకుండా ఉచితంగా మందులను అందజేస్తుండటం విశేషం.
జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ‘ఉచిత మెగా వైద్య శిబిరం’ నిర్వహించారు. సంజీవని ఆస్పత్రి వైద్యులు ఎం.ప్రణీత, ఎం.సురేశ్, యు.అనిత, యు.సురేశ్, కె.కిషోర్ ఆధ్వర్యంలో పేషెంట్స్‌కు ట్రీట్‌మెంట్ అందించారు. సిబ్బంది ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. దాదాపు 300కు పైగా మంది ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఎండీ జనరల్ మెడిసిన్ ఊడుగుల సురేశ్ రోగులకు బీపీ, షుగర్ మొదలగు జబ్బులకు సంబంధించి తగు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు జాగ్రత్తల గురించి వివరించారు. ఎండీ చెస్ట్ ఫిజీషియన్ కిశోర్ కుమార్ కామిశెట్టి ఊపిరితిత్తులకు సంబంధించి దగ్గు, దమ్ము, ఆయాసం, ఆస్తమా, గురక మొదలగు డిసీజెస్ గురించి పేషెంట్స్ కు పూర్తి అవగాహన కల్పించారు.

స్పైరో మీటర్ ద్వారా లంగ్స్ పని తీరు పరిశీలన..
మెగా క్యాంప్ లో సంజీవని ఆస్పత్రిలో స్పైరో మీటర్ ద్వారా రోగుల ఊపిరితిత్తుల పనితీరును పరిశీలించారు. ఆ రిపోర్టు ఆధారంగా లంగ్స్ పని చేసే తీరును తెలుసుకోవచ్చని డాక్టర్ కిశోర్ వెల్లడించారు.
స్మోకర్లు, ఇతర ఆపరేషన్ అయిన వాళ్ల లంగ్స్, శ్వాస కోస గొట్టాల పనితనం, ఊపిరితిత్తుల తాకత్ స్పైరో మీటర్ ద్వారా మాత్రమే అంచనా వేయొచ్చని డాక్టర్ కిశోర్ స్పష్టం చేశారు. ఆస్తమా, డస్ట్ ఇతర అలర్జీ ఉన్న వాళ్ల లంగ్స్ పనితీరు ఈ పరీక్ష ద్వారా స్పష్టంగా కనుగొనవచ్చని వివరించారు. పేషెంట్స్ క్యాంప్ లో ఈ మీటర్ ద్వారా తమ ఊపిరితిత్తుల పనితీరు పరీక్షించుకోగా..వైద్యులు ఆ రిపోర్టు ఆధారంగా మందులు అందజేశారు.
ఆర్థోపెడిక్ సర్జన్ ముషం సురేశ్ ఎముకలు, కీళ్లు, కండరాలు, నరాలకు సంబంధించిన డిసీజెస్ గురించి పేషెంట్స్ కు అవగాహన కల్పించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. క్యాంప్ లో పేషెంట్స్ కు అవసరమైన పరీక్షలకు రెఫర్ చేయడంతో పాటు అవసరమైన మెడిసిన్స్ డాక్టర్ సురేశ్ రాశారు.

ఇక వైద్యులు అనిత, ప్రణీత మహిళలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలపైన అవేర్‌నెస్ కల్పించారు. రొమ్ముగడ్డలు, కంతులు, అపెండిక్స్, థైరాయిడ్, అర్శమొలలు మొదలగు వాటికి జనరల్ సర్జన్ అనిత ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను అందజేశారు. గర్భిణులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఇన్ ఫెర్టిలిటీ, గర్భసంచి తదితర సమస్యలపై డాక్టర్ ముషం ప్రణీత అవగాహన కల్పించారు.

ఆస్పత్రి మేనేజ్‌మెంట్ పడాల కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘సంజీవని’ ఆస్పత్రి వైద్య సిబ్బంది, వైద్యులు అధిక సంఖ్యలో పేషెంట్స్ పాల్గొన్నారు.
