వేద న్యూస్, జమ్మికుంట:

గత ప్రభుత్వం నిర్మించిన ‘డబుల్’ ఇండ్లను పంపిణీ చేసేందుకు ప్రస్తుతం సర్కారు ముందుకు రావాలని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని జమ్మికుంట మాజీ జడ్పీటీసీ డాక్టర్  శ్రీరామ్ శ్యామ్  కోరారు.  ఈ మేరకు ఆయన ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్  వందల సంఖ్యలో ‘డబుల్’ ఇండ్లు నిర్మించారని, కానీ, ఇప్పటివరకు  వాటిని నిరుపేదలకు పంచలేదని, దాంతో  అనేక మంది నిరుపేదలు కిరాయి ఇళ్లల్లో జీవనం కొనసాగిస్తున్నారని వివరించారు.

జమ్మికుంట పట్టణంలో ధర్మారం, కొత్త మార్కెట్ వద్ద వందల కొద్ది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని వాటిని పంపిణీ చేయకపోవడం వల్ల అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రస్తుత సర్కారు అయినా వాటిని పంపిణీ చేయాలని, అందుకు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలన్నారు.  జమ్మికుంట పట్టణ, మండల అధికారుల ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాల నుండి దరఖాస్తులు తీసుకున్నప్పటి కూడా వాటికి మోక్షం లభించలేదని చెప్పారు.