- ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ.కోదండరాం
వేద న్యూస్, జమ్మికుంట:
తెలంగాణ జన సమితి పార్టీ 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో అమరవీరుల స్థూపానికి జన సమితి పార్టీ లీడర్లు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా టీజేఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి..డబ్బులే కేంద్రంగా జరుగుతున్న నేటి రాజకీయాల్లో తెలంగాణ జన సమితి మాత్రం ప్రజలతో మమేకమై ఉందని చెప్పారు. టీజేఎస్ ప్రజల సమస్యలను నిరంతరం రాజకీయ ఎజెండా మీద నిలపగలిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద అవిశ్రాంత పోరాటం చేసి భూనిర్వాసితుల పక్షాన పోరాడి వారికి ధైర్యంగా నిలబడిందని గుర్తు చేశారు.
ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద స్పందించి, వాటిని రాజకీయ ఎజెండా మీద నిలపడంలో జన సమితి ప్రధాన పాత్ర వహించిందని వివరించారు.
ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్య మీద లోతుగా అధ్యయనం చేసి అనేక సదస్సులు నిర్వహించి.. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా ఎజెండా మీద నిలిపిందని,
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడగల ఏకైక పార్టీ తెలంగాణ జన సమితి అని వెల్లడించారు. రాబోయే రోజుల్లో పైసల రాజకీయాలను అధిగమించాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని, టీజేఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, మహిళా జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి, రాష్ట్ర నాయకులు రతన్ రావ్, యువజన సమితి రాష్ట్ర నాయకులు మోరె గణేష్, యవజన సమితి జిల్లా అధ్యక్షులు కర్రె సతీష్ యాదవ్, నెలవేని రమేష్, జకీర్, సయీద్ తదితరులు పాల్గొన్నారు.