• నర్సంపేట నియోజకవర్గ జనసైనికుల ఆవేదన అర్థం చేసుకోవాలని వినతి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట:
బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం వరంగల్ నగరానికి నేడు(బుధవారం) ప్రచారానికి విచ్చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు ఆ పార్టీ నర్సంపేట నియోజవర్గ ఇన్ చార్జి మేరుగు శివ కోటి యాదవ్ ఒక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఒక ప్రకటన మంగళవారం విడుదల చేశారు. జనసేన పార్టీ తరఫున తమ ఆవేదనను అర్థం చేసుకొని వెంటనే స్పందించి పార్టీ భవిష్యత్తు పట్ల నర్సంపేట నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

నర్సంపేట నియోజకవర్గంలో స్థానికంగా ప్రజాదరణ పొందుతూ బలమైన రాజకీయ శక్తిగా, ప్రత్యామ్నాయ పార్టీగా అవతరిస్తున్న నర్సంపేటలో జనసేన పార్టీ పోటీని వద్దనుకోవడం తమకు అత్యంత బాధ కలిగించిందని తెలిపారు. జనసేన కేడర్ ను నిరుత్సాహానికి గురిచేసి, ఇప్పటికీ ఎలాంటి భరోసా కల్పించకపోవడంతో నియోజకవర్గంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనేది ప్రశ్నార్ధకాన్ని మిగిల్చిందని స్పష్టం చేశారు.

పోటీ చేయకపోయినా పర్వాలేదు అనుకోని ఒక నియోజకవర్గ ఇన్ చార్జిగా, ప్రజానాయకుడిగా మీభరోసా కోసం మిమ్మల్ని కలవడానికి హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తనను రమ్మని పిలిచి, మిగతా ఇన్ చార్జిలను అనుమతించి ..తనను లోపలికి రాకుండా అడ్డుకొని గేటు బయట నిల్చోపెట్టినారని ఆరోపించారు. అలా అగౌరపరచడం ఎంతవరకు సమంజసం? అని అడిగారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనసేన 5 స్థానాల్లో పోటీకి ఉన్న ఒక్క స్థానంలో కూడా జనసేన అభ్యర్థిని నిలబెట్టకుండా..బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారానికి రావడం చాలా బాధాకరం, విడ్డూరంగా ఉందని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న తమలాంటి జన సైనికుల సాధక బాధలు, ఇబ్బందులు పట్టావా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ పార్టీని వీడకుండా మీపై ఉన్న అఖండమైన విశ్వాసంతో, మీ భరోసా కోసం ఎదురుచూస్తున్నామని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి పేర్కొన్నారు.