•  జె.సికిలి స్కూల్‌ అడ్మిషన్ ఇవ్వలేదని బాధితురాలు వీడియో
  •  వెంటనే స్పందించి..ఆర్ కే సాగర్‌తో మాట్లాడిన లీడర్ శివకోటి
  •  స్వాతి కుటుంబానికి అండగా ఉంటామని జనసేన ఎమ్మెల్యే హామీ

వేద న్యూస్, వరంగల్:
వరంగల్ జిల్లా నర్సంపేట వాసికి అండగా ఉంటామని జనసేన పార్టీ నాయకులు బుధవారం తెలిపారు. వివరాల్లోకెళితే..నర్సంపేట పట్టణానికి చెందిన ఇస్రుం స్వాతి కుమారుడు తేజుకు ఇటీవల నిర్వహించిన ఆల్ ఇండియా శ్రేష్ట పరీక్షల్లో 997వ ర్యాంకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నర్సాపురంలోని జె.సికిలి స్కూల్‌లో సీటు వచ్చింది. జాయిన్ చేసేందుకు వెళితే మతం, భాష, ప్రాంతం, ఆర్థిక వైశమ్యాలను కారణాలుగా చూపిస్తూ స్కూల్ యాజమాన్యం అడ్మిషన్ ఇవ్వకుండా వారిని బయటికి నెట్టి వేసిందని, తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని, ఆవేదనను స్వాతి వీడియో రూపంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు.

వీడియోను బుధవారం ఉదయమే వీక్షించిన జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ నాయకుడు శివకోటి యాదవ్ వెంటనే స్వాతి‌తో ఫోన్‌లో మాట్లాడారు. న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలిపారు. విషయాన్ని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకుడు ములుకుంట్ల సాగర్(ఆర్‌కే నాయుడు) దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి కాన్ఫరెన్స్ కాల్‌లో బాధితురాలు స్వాతితో మాట్లాడి జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నారు.

నర్సాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌తో ఫోన్‌లో మాట్లాడి స్వాతి, తన కుమారుడు తేజుకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే నాయకర్ స్వాతి, తన కుమారుడికి అక్కడ వసతి, భోజన సదుపాయం కల్పించి..స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి అడ్మిషన్ ఇచ్చే విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ స్వాతి కుటుంబ సభ్యులకు నైతికంగా, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అండగా ఉంటామని తెలిపారు. ఈ సమస్యపై వెంటనే స్పందించినందుకు రాష్ట్ర నాయకులు సాగర్, ఎమ్మెల్యే నాయకర్‌లకు నర్సంపేట నియోజకవర్గ జనసేన ఇన్ చార్జి శివకోటి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.