- అన్ని సమీకరణాలు కుదిరితే స్థానిక ఎన్నికల బరిలో
- బిజెపి తరఫున టికెట్ ఆశిస్తున్న పాత్రికేయుడు
వేద న్యూస్, ఇల్లందకుంట:
ఇల్లందకుంట మండల పరిధిలో ప్రముఖ పాత్రికేయుడిగా, ఉన్నత విద్యావంతుడిగా, చక్కటి ప్రైవేటు టీచరుగా పేరు గడించిన ఓ జర్నలిస్టు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులతో సత్సంబంధాలు కలిగి ఉన్న సదరు పాత్రికేయుడు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున ప్రజా ప్రతినిధిగా బరిలో నిలవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. సదరు జర్నలిస్టు ఏబీవీపీలో కీలకంగా పనిచేసి.. సంఘ్ పెద్దలు, కార్యకర్తలతో విస్తృత సంబంధాలు కలిగి ఉండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.
జడ్పిటిసిగా ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల రీత్యా పలువురు ఆశావహులు ఇప్పటికే ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే బిజెపి తరఫున రిజర్వేషన్ కేటాయింపులో భాగంగా ఆ టికెట్ కోసం ఓ పాత్రికేయుడు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది.
మండల పరిధిలోని సామాజిక సమీకరణాలు, పరపతి, పలుకుబడి, గతంలో ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన సందర్భంలో విద్యార్థులు, ప్రజలతో ఉన్న సత్సంబంధాలు.. తనకు ఎన్నికలలో మద్దతు తెలిపే క్రమంలో ఉపయోగపడే అవకాశాలు గా.. సదరు వ్యక్తికి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయని భావిస్తున్నారు.
మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు పోటాపోటీ ప్రచారాలు ఇక మొదలయ్యాయని భావన సైతం కనబడుతున్నది. సదరు జర్నలిస్టు తో పాటు సామాజిక సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు సైతం జడ్పిటిసి గా బరిలోని ఇవ్వాలని భావిస్తూ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. బిజెపిలో మండల స్థాయిలో కీలకంగా ఉన్న నాయకులు కూడా ఈ స్థానంపై గురి పెట్టి తమ ప్రయత్నాల్లో ఉన్నారు.