•  టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు
  •  ఫెడరేషన్ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ

వేద న్యూస్, కరీంనగర్:
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా..జర్నలిస్టుల సమస్యలను ఇంత వరకు పరిష్కరించలేదన్నారు.

శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫెడరేషన్ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ… మెజారిటీ జర్నలిస్టుల జీవన పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని, ముఖ్యంగా గ్రామీణ విలేకరుల పరిస్థితి అధ్వానంగా  ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా ద్రోహం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఒరిగిందేమి లేదన్నారు.

కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కరీంనగర్, హుజురాబాద్ లో ఇచ్చిన ఇండ్ల  స్థలాల సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు అనుమతి పత్రాలు అందించాలన్నారు.

కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొండ సత్తయ్య, కొమ్ము గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ శంకర్, జర్నలిస్ట్ నాయకులు గౌతమ్, జి నరేష్, సుదర్శన్ రెడ్డి, ఆర్ శంకర్ రెడ్డి, జి కిరణ్, దీక్షిత్, తిరుపతి, ఎం సతీష్, ఏ అనిల్, తదితరులు పాల్గొన్నారు.