వేద న్యూస్, హన్మకొండ:
మన దేశంలోని బాల బాలికలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో భారతప్రభుత్వం ‘అంగన్ వాడీ కేంద్రాల’ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటాయి. ‘అంగన్ వాడీ’ కేంద్ర సిబ్బందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ప్రకారం వేతనాలు చెల్లిస్తుంటాయి. పౌష్టికాహారాన్ని అందించడంలో అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. కాగా, హన్మకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని నర్సింహులపల్లి గ్రామంలో అంగన్ వాడీ కేంద్రంలో పౌష్టికాహారం అందించాలనే లక్ష్యాన్ని నీరు గారుస్తున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
సదరు అంగన్ వాడీ కేంద్రంలోని అవకతవకల గురించి బాహాటాంగానే ఊరి ప్రజలు ఆరోపిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని అంటున్నారు. తమ సొంత వాళ్లకు మాత్రమే గుడ్లు, ఇతర ఆహార సామగ్రి ఇస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పౌష్టికాహారం అందుతున్న తీరు గురించి ఇప్పటి వరకు గ్రామంలో కనీసంగా అధికారులు తనిఖీ చేసిన దాఖలాలు లేవని గ్రామస్తులు అంటున్నారు.
నూతన ప్రభుత్వ ‘ప్రజాపాలన’లో ‘ప్రత్యేక’ అధికారులు ఈ విషయమై దృష్టి సారించాలని కోరుతున్నారు. తనిఖీలు చేపట్టే నాథుడు లేక ఇలా ఇష్టారాజ్యంగా సదరు అంగన్ వాడీ కేంద్రంలో వ్యవహారాలు ఉంటున్నాయని అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు వెంటనే స్పందించాలని ఆ ఊరి ప్రజలు అంటున్నారు. అంగన్ వాడీ సెంటర్ పని తీరును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.