వేద న్యూస్, డెస్క్:
కల్వకుంట్ల చంద్రశేఖర రావును నమ్మి ప్రజలు పది సంవత్సరాలపాటు అధికారమిస్తే రాష్ట్రంలో దౌర్జన్య పూరిత దోపిడి కుటుంబ ఆధిపత్య పరిపాలన సాగించి రాష్ట్ర సంపాదన దోచుకున్నారని అలాంటి పార్టీని పార్లమెంటు ఎన్నికలలో బొంద పెట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఖమ్మం మహానగరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణతోపాటు పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్, విశ్రాంత ఆచార్యులు వడ్డే రవీందర్, టీపి జాక్ ఖమ్మం జిల్లా ఇంచార్జ్ బట్టు రాజేందర్, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి సర్దార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల ఉద్యమకారుల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేసి కేవలం కుటుంబ పాలన చేసి కుటుంబ సభ్యులు నాయకులు అధికార పార్టీ కార్పొరేట్ సంస్థలు అన్ని విదాలుగా దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి, హైదరాబాద్ భూముల అమ్మకాలు, ఖనిజ సంపద సంపదను కొల్లగొట్టారు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలు అమ్ముకొని నిరుద్యోగులకు ద్రోహం చేసిన పార్టీ అభ్యర్థులను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులంతా వేల కోట్ల రూపాయలను దోచుకుని రాష్ట్రాన్ని వల్లకాడు చేశారని అలాంటి పార్టీని లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో 100 మీటర్ల లోతున పాతిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలను, జూనియర్ కళాశాలలో విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసి పేదలకు నాణ్యమైన విద్యకు దూరం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను రాజకీయంగా బొంద పెట్టాలని విద్యార్థి ,ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.అనంతరం ప్రజాసంఘాల జెఏసి వైస్ చైర్మన్ డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ దేశంలో 10 సంవత్సరాల పాటు పాలించి నరేంద్ర మోడీ బీసీ, ఎస్సీ ,ఎస్టీలకు అమలు పరచవలసిన రిజర్వేషన్లను తుంగలో తొక్కాడని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయకుండా పేద వర్గాలకు తీవ్ర అన్యాయం చేసినారని, పేద వర్గాలపై అనేక రకాల పనులు పెంచి తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసాడని అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జనగణన చేస్తామని ప్రకటించినందుకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కేయు విశ్రాంతి అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి వడ్డే రవీందర్, టీపి జాక్ ఖమ్మం జిల్లా ఇంచార్జ్ బట్టు రాజేందర్, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి సర్దార్ తదితరులు పాల్గొన్నారు.