వేద న్యూస్, కమలాపూర్ :

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా పంగిడిపల్లి క్రాస్ రోడ్ వద్ద 2012లో
కీ.శే. ఇంజపూరి కనకలక్ష్మి కొమురయ్య ల జ్ఞాపకార్థం వారి కుమారులు ఇంజపూరి పోశం, ఇంజపూరి శంకర్ లు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన ఒక కమాన్ ఏర్పాటు చేశారు. ఈ కమాన్ ని అప్పటి హుజురాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభింపజేసి.. సమ్మక్క సారలమ్మ దేవస్థాన కమిటీకి అప్పచెప్పారు.

చొరవ చూపి చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్

నాటి నుంచి చాలా సంవత్సరాలు ఆ కమాన్ బాగానే ఉంది. దాని వలన ఎటువంటి సమస్య తలెత్తలేదు. కానీ ఈ మధ్యనే కొన్ని భారీ వాహనాలు ఆ కమాన్ ని ఢీకొట్టడం వలన కమాన్ మొత్తం ముందు వైపుకు అంటే హుజురాబాద్ – పరకాల హైవే రోడ్డు వైపు వంగి ఉంది. వాహనదారులు, ప్రజలు, అధికారులు, పోలీసులు, సంబంధిత శాఖ వారు అందరూ దానిని చూసుకుంటూనే వెళ్తున్నారు తప్ప.. ఏ ఒక్కరు దాని గురించి పట్టించుకోవడం లేదు. కాగా, ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు, ప్రజల పై వంగి ఉన్న కమాన్ మొత్తానికి కూలిపోయి పడితే పరిస్థితి ఏంటి అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అసలు దీని గురించి పట్టించుకునే నాధుడే లేడా? అని అడుగుతున్నారు. అధికారులు లేదా రాజకీయ నాయకులు ఎవరో ఒకరు చొరవ చూపి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.