వేద న్యూస్, కమలాపూర్ : 

హనుమకొండ జిల్లా కమలాపూర్ లో తాత ముత్తాతల కాలం నాటి నుండి గ్రామ దేవతల నిలయమైన పురాతన చారిత్రక కట్టడం అయినటువంటి కమలాపూర్ గడిని తౌటం రవీందర్, మరికొంత మంది కొనుగోలు చేశామనే నెపంతో గడిని కూల్చివేస్తూ ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని భావిస్తున్నారని ఇటువంటి అక్రమ చర్యలను నిలిపివేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమలాపూర్ లోని వివిధ కుల సంఘాల పెద్ద మనుషులు, స్థానిక యువత అధికారులకు వినతి పత్రం అందజేశారు. వాస్తవంగా తాత ముత్తాతల కాలం నాటి నుండి ఊర్లో ఏ పండుగ జరిగిన గడి దగ్గర మొదలయ్యేదని ఆ తర్వాతే ఊరేగింపుగా ఆయా గుడిలకు ప్రజలంతా వెళ్లడం ఆనవాయితీ అని పెద్ద మనుషులు పేర్కొన్నారు. అధికారులైన, ప్రభుత్వాలైన పురాతన చారిత్రక కట్టడాలను రక్షించాలని, రక్షించడమే కాకుండా ఏమైనా మరమ్మత్తులు అవసరమైనప్పుడు వాటి మరమ్మత్తులు కూడా చేపించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అదేవిధంగా భవిష్యత్ తరాలకు వారసత్వంగా చారిత్రక కట్టడాలను అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. గ్రామ దేవతల నిలయమైనటువంటి పురాతన చారిత్రక కట్టడం అయినటువంటి గడిని అక్రమ ఆక్రమణదారుల చెర నుంచి రక్షించి వారు చేపట్టిన కూల్చివేత పనులను అడ్డుకోవాలని, ప్రజల విశ్వాసాలను కాపాడాలని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఆ కట్టడాలు ఉండాలన్నారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకొని ప్రజలందరికీ ఉపయోగపడే ఆ గడిని రక్షించుట కొరకై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కుల సంఘాల పెద్ద మనుషులు, యువత విన్నవించారు.