• బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యా నాయక్
  • డోర్నకల్ లో బీఆర్ఎస్ ను గెలిపిస్తామని దివ్యాంగుల తీర్మానం
  • సీఎం కేసీఆర్ కు కానుకగా ఇస్తామని మరిపెడ దివ్యాంగుల ఆత్మీయ సమావేశంలో వెల్లడి

వేద న్యూస్, మరిపెడ:
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజక వర్గ పరిధిలోని మరిపెడ మున్సిపల్ కేంద్రంలో గురువారం నియోజకవర్గ వికలాంగుల ఆత్మీయ సమావేశం యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కేతి రెడ్డి వాసుదేవ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయం చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.500లు ఉన్న ఆసరా పింఛను రూ.4,016 పెంచి ఎన్నికల అనంతరం రూ.6,016 లు సర్కార్ అందజేయనుందని తెలిపారు.

దివ్యాంగులపై మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పారు. డోర్నకల్ నియోజకవర్గంలో 5,000ల మందికి పైగా దివ్యాంగుల పింఛను అందుతుందని పేర్కొన్నారు. రిజర్వేషన్ లలో సైతం 3శాతం నుండి 5శాతం పెంచిన ఘనత బీఆర్ ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉచితంగా బీ ఆర్ ఎస్ ప్రభుత్వము ఉచితంగా కోచింగ్ ఇవ్వనుందన్నారు.

వంద శాతం రాయితీ తో వికలాంగులకు రూ.1 లక్షా 25వేల స్కుటీలు, వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిగా రూ. లక్ష కల్యాణ లక్ష్మీ పథకంతో పాటు రూ.1 లక్ష 25వేలు అందజేయనుందని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దివ్యాంగుల పింఛను వెయ్యికి మించకుండా రాష్ట్రానికి ఓ తీరున వ్యవహరిస్తుందని విమర్శించారు.

జాతీయ రాజకీయ పార్టీల దిగజారుడు రాజకీయాలకు దివ్యాంగులు తగిన బుద్ది చెప్పి సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీ ఆర్ ఎస్ కారు గుర్తుకు ఓటేసి.. డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్. రెడ్యా నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. అనంతరం దివ్యాంగులతో కలిసి రెడ్యానాయక్ భోజనం చేశారు. కార్యక్రమంలో 7 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, సర్పంచులు,ఎంపీటీసీలు,పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.