వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టం అగ్నిగుండాల కార్యక్రమం గురువారం అశేష భక్త జనుల మధ్య ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గత పది రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఈ నెల 10న శ్రీ వీరభద్ర స్వామి వారి కళ్యాణంతో ప్రారంభమై..గురువారం తెల్లవారుజామున అశేష భక్త జనం మధ్యన అగ్ని గుండాల కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి. అనేకమంది భక్తులు భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాల్లో నడిచారు.

ఈ సందర్భంగా ఆలయ పూజారి పరేశ్వరయ్యా మాట్లాడుతూ శోభ కృత నామ సంవత్సర మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తకొండ వీర భద్రస్వామీ బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయని చెప్పారు.

ఆలయ ఈఓ కిషన్ రావు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించామని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేశామని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి, మరీ ముఖ్యంగా పారిశుధ్య కార్మికులకు..ఆలయ ప్రధాన అర్చకులు పరమేశ్వరయ్య,రాజయ్య కృతజ్ఞతలు తెలిపారు.

గురువారం సాయంత్రం కొత్తకొండ గ్రామ ఊరేగింపు అనంతరం బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. వీరభద్ర స్వామివారి దర్శనానికి గత 20 సంవత్సరాలుగా వస్తున్నామని, స్వామివారు కోరిన కోరికలు తీర్చే అత్యంత మహిమాన్వితులని అగ్నిగుండాల్లో నడిచిన భక్తులు తెలిపారు.