- కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల
వేద న్యూస్, వరంగల్:
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పాలనలో విఫలమైందని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలోని అన్ని రంగాలను రేవంత్ ప్రభుత్వం వంచించిందని వెల్లడించారు. రైతుకు అండగా నిలిచి కరోనా కష్టకాలంలోనూ ‘రైతు బంధు’ అందించి.. అన్నదాతను అభివృద్ధి పథంలో నడిపించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పదేండ్ల కాలంలో కృషి చేశారని వివరించారు. కాగా, కాంగ్రెస్ సర్కారు ‘రైతు భరోసా’ ఎగ్గొట్టి.. రుణమాఫీ నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నదని తెలిపారు.
ధాన్యం కొనుగోలు విషయంలోనూ కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని నరేశ్ స్పష్టం చేశారు. కేవలం సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మాట మార్చిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఈ సంగతి చెప్పలేదని గుర్తుచేశారు. దొడ్డు వడ్లు పండించే వారు రైతులు కాదా? అని ప్రశ్నించారు.
తెలంగాణలోని అన్ని వర్గాల పక్షాన, ముఖ్యంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతున్నదని యువనేత మైనాల వివరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో గులాబీ కేడర్ ప్రజల్లోకి వెళ్తోందని, కేటీఆర్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ సర్కారు ఓర్వలేకపోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ‘స్థానిక’, ఇతర ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.