- ముఖ్యఅతిథిగా హాజరైన కేయూ వీసీ రమేశ్
- ఉత్తర తెలంగాణలో ఘన చరిత్ర కలిగిన కాలేజీ అని వ్యాఖ్య
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాల 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ కే. నిరంజన్ తెలిపారు. ఆయన అధ్యక్షతన జయసేన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ హాజరై మాట్లాడారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన లాల్ బహదూర్ కళాశాల ఉత్తర తెలంగాణలోని నిరుపేదలకు విద్యను అందిస్తోన్న ఏకైక కళాశాలని పేర్కొన్నారు. వేలాదిమంది పేద విద్యార్థులను ఉన్నత స్థానాలకు అవకాశం కల్పించి..ఉన్నత లక్ష్యాలు చేరుకోవడానికి ఇక్కడి అధ్యాపకులు, యాజమాన్యం చేసిన కృషి అనిర్వచనీయమని కొనియాడారు.
అనేక సంఘర్షణలకు, సామాజిక చైతన్యానికి లాల్ బహదూర్ కళాశాల నెలవని చెప్పారు. ఈ ప్రాంత విద్యార్థుల కోసం అన్ని రంగాలలో పోటీని తట్టుకొని 50 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ప్రతీ సబ్జెక్టులో గొప్ప అధ్యాపకుల వల్ల ఈ కళాశాల అడ్మిషన్ పొందుతే ఉద్యోగం దొరికినంత అవకాశంగా ఆ రోజుల్లో ఉండేదని స్పష్టం చేశారు. నేటికీ దాని నాణ్యత ప్రమాణాలు కొనసాగించడం సంతోషమని, మారుమూల ప్రాంతాల విద్యార్థులను కూడా ఉన్నత ఆశయాల కోసం సమాజాన్ని మేలుకొలుపున్న కళాశాల ఎల్బీ కాలేజీయేని వివరించారు.
కాకతీయ యూనివర్సిటీ తో పోటీబడ్డ ఏకైక కాలేజీ..ఎల్బీ కళాశాలని పేర్కొన్నారు. కాలేజీని గొప్పగా తీర్చిదిద్దిన అధ్యాపకులకు ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్, హైదరాబాద్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మరింత నాణ్యమైన ప్రమాణాల కోసం యూనివర్సిటీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, యాజమాన్యం కూడా చురుకుగా మార్పులు చేయాలని కోరారు. మరో విశిష్ట అతిథిగా 10వ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అజయ్ నంద కంండూరి హాజరై కళాశాల పేరు ప్రతిష్టలను కొనియాడారు. విద్యతోపాటు ఎన్సీసీ, క్రీడలు, సామాజిక సేవలు అనేక రంగాల్లో లాల్ బహదూర్ కళాశాల నగరానికి ఆణిముత్యమని, 50 సంవత్సరాల ఘన కీర్తిని ప్రత్యేక రిపోర్టుతో ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు రిపోర్టు చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ టి రమేష్ కి ముందు ఎన్సిసి క్యాడర్స్ గౌరవ వందనాన్ని సమర్పించారు.
తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహానికి పూలమాలవేసి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడిటోరియంలో సరస్వతి విగ్రహానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం మొదలు పెట్టారు. వైస్ చాన్స్ లర్ ను ఘనంగా సత్కరించారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో సత్యేంద్ర వనం వైస్ ప్రెసిడెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ హైదరాబాద్, కాలేజీ చైర్మన్ కే.నిరంజన్, సెక్రెటరీ ఈ రాజేంద్ర కుమార్, ట్రెజరర్ ఆనందకుమార్ బోల్ల, రమేష్ జిఎం జాయింట్ సెక్రెటరీ, శకుంతల, జోష్ణ, వినయ్ కుమార్, నరేష్ కుమార్..గవర్నర్ బాడీ మెంబర్స్ హైదరాబాద్, డాక్టర్ కె రాజేందర్ రెడ్డి, అధ్యాపకులు పూర్వ విద్యార్థిని విద్యార్థులు కళాశాల విశ్రాంత అధ్యాపకులు ప్రిన్సిపాల్ లు వివిధ రంగాల్లో పనిచేస్తున్న విద్యార్థులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. 50 వసంతాల ప్రత్యేక లోగోను వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ టి రమేష్ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లా స్థాయిలో యూనివర్సిటీ స్థాయి వివిధ పోటీలు నిర్వహించి రాబోయే కొన్ని నెలల్లో ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని చైర్మన్ తెలిపారు.