• జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి

వేద న్యూస్, హైదరాబాద్ :

రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాల్లో లైబ్రేరియన్ ఖాళీలతో పాటు సిబ్బందిని కూడా వెంటనే భర్తీ చేయాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి కోరారు.

ఆదివారం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి లైబ్రేరియన్ పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంతో లైబ్రేరియన్ కోర్సులు చదివిన నిరుద్యోగులు మానసిక క్షోభకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం కొన్ని మండలాల్లో పూర్తిస్థాయి లైబ్రేరియన్లను నియమించకపోవడం వల్ల పాఠకులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధపడే నిరుద్యోగులకు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచేవారు లేకపోవడం దురదృష్టకరమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో పూర్తిస్థాయి ప్రభుత్వ పక్కా భవనాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని, పాఠకులు విద్యార్థులు నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు.