వేద న్యూస్, ఖిలా వరంగల్ :
మామునూరు మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వరంగల్ జిల్లా సమన్వయ అధికారి యం.సరిత, శాయంపేట ఎంజెపి ప్రిన్సిపాల్ విజయజ్యోతి, అయినవోలు ఎంజెపి ప్రిన్సిపాల్ శ్రీలత, ఉర్సుగుట్ట ఎంజిపి ప్రిన్సిపాల్ అంజి రెడ్డి,పూర్వ విద్యార్థి డాక్టర్ మాలోతు సర్దార్, హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపాల్ వై మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వార్షిక నివేదిక ప్రస్తావించి, ఎంజెపి పాఠశాలల్లో చదవడం అంటే విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధి చెందడం అని అన్నారు. ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో క్రమశిక్షణతో విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా తమ పాఠశాల కొనసాగుతుందని దీనికి తల్లిదండ్రుల సహకారం హర్షనీయం అన్నారు. తదనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆసక్తికరమైన స్ఫూర్తిదాయకమైన విషయాలను తెలియజేస్తూ, కార్పొరేట్ విద్య వ్యవస్థకి ధీటుగా ప్రణాళిక బద్ధమైన విద్యను అందించుటలో ఎం జె పి పాఠశాలలు సఫలమయ్యాయి అని అన్నారు. చదువుపై చాలామంది అధిక డబ్బును వృధా చేస్తున్నారని ప్రభుత్వం ఎంతో ఖర్చుతో ఈ సంస్థలను నడిపిస్తుందని కావున ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ పాఠశాలలో చదువుకోవడానికి ముందడుగు వేయాలని కోరారు.
పాఠశాల విద్యార్థుల చేత సాంస్కృతి సాంప్రదాయాలు చాటిచెప్పేలా నృత్య ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు, పౌరాణిక డ్రామా స్కిట్స్, సంగీతం పాటలు, తదితర కార్యక్రమాలు ప్రదర్శిస్తే ఆ కార్యక్రమాలను తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏటీపీ సురేందర్, డిప్యూటీ వార్డెన్ రమణారెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ,విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.