– ఎన్‌హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా పిలుపు
వేద న్యూస్, వరంగల్:
నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ..ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్‌హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి సుమారుగా 17 వేల మంది ఉద్యోగులు చాలీచాలని వేతనాలు తీసుకుంటూ శ్రమ దోపిడి గురవుతున్నారని చెప్పారు. గత నెలలో నిరవధిక సమ్మె చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 20 రోజులలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి..నేటికీ హామీలు నెరవేర్చలేదని చెప్పారు. అందువల్ల ‘మహాధర్నా’ చేయాలని ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు.
ఎన్‌హెచ్ఎం ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలి
ఎన్‌హెచ్ఎం స్కీం లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ఎలాంటి షరతులు లేకుండా..బేషరతుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం, హెల్త్ కార్డులు, ఆరోగ్య బీమా ఎక్స్ గ్రేషియా తదితర హక్కులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు ఈ నెల 9న హైదరాబాద్‌లోని డైరెక్టర్ అఫ్ హెల్త్ (డీహెచ్) కార్యాలయం ఎదుట ‘మహాధర్నా’ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఎన్ హెచ్ఎంకాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.